ఎన్డీఏలో పేరుకు తాము కూడా భాగస్వామి పార్టీ అని అతి తరచుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ మిత్రధర్మాన్ని ఏనాడూ పాటించిన పాపాన పోలేదు! రాష్ట్ర పార్టీ నాయకులతో కలిసి భేటీలు గాని, ఉమ్మడి కార్యాచరణతో కార్యక్రమాలు గాని నిర్వహించే అలవాటు పవన్ కళ్యాణ్‌కు లేదు. మోడీ, అమిత్ షా తనకు మిత్రులు అని చెప్పుకుంటూ చలామణి అయిపోవడం ఒకటే ఆయనకు తెలిసిన విద్య! ఇలాంటి రాజకీయ దురహంకారానికి, ఈగోకు ప్రతీక అయిన పవన్ కళ్యాణ్ తాజాగా ఆ తత్వాన్ని మరోసారి ప్రదర్శించారు.
ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగల రాజకీయ పొత్తుల గురించి ప్రకటన చేసేశారు. ఏపీలో బిజెపి జనసేన పార్టీలు తెలుగుదేశంతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని పవన్ అనడం గమనార్హం. ఆయన ఏకపక్షంగా ఇలాంటి ప్రకటన చేయడం పట్ల కమలదళం నాయకులు గుర్రుమంటున్నారు.
జగన్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలడానికి వీలు లేదని, ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే అందుకు అందరూ కలిసి పోరాడాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. అయితే దీనికి కాషాయ దళం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.
చంద్రబాబు నాయుడు ఒక పర్యాయం ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయి వచ్చారు గాని.. పొత్తులు సీట్ల పంపకాల విషయంలో వారి నడుమ ఏకాభిప్రాయం కుదరలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకతతో పవన్ మాత్రం కుతకుత లాడిపోతున్నారు. చంద్రబాబు పల్లకీ మోయడానికి తహతహలాడిపోతున్నారు.
అందుకే ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన తన తొందరపాటును ప్రదర్శించారు. ఈ సమావేశంలో ఆయన తన వాదనను వినిపించి, బిజెపి అధిష్టానాన్ని ఒప్పించి.. తెలుగుదేశంతో పొత్తులకు శ్రీకారం చుట్టి ఉంటే చాలా సబబుగా ఉండేది. కనీసం సమావేశంలో మాట్లాడడం అనుచితం అనుకుంటే గనుక, అధిష్ఠానంతో ప్రైవేట్ గా తన ప్రతిపాదనను తెలిపి, వారి అనుమతిని తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. అసలు బిజెపి నిర్ణయంతో ఆలోచనతో సంబంధమే లేదన్నట్లుగా తనంత తాను ఈ ప్రకటన చేసేయడం వింతగా కనిపిస్తోంది.
మిత్రధర్మాన్ని పాటించి వారి ఒప్పుకోలు తెలుసుకోకుండా పవన్ ప్రకటనలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ సహిస్తారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో నడుస్తోంది. పవన్ వైఖరిని ఇలాగే అనుమతిస్తే గనుక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్నీ ఎవరికి చిత్తమొచ్చిన రీతిగా వారు మాట్లాడుతూ కూటమి పరువు బజారున పడేసే ప్రమాదం కూడా ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారుతోంది.