భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును ఈస్ట్ కోస్ట్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ గా కేంద్రం నామినేట్ చేసింది. ఈ పదవిలో ఆయన ఉత్తరాంధ్రా జిల్లాలలోని వినియోగదారులకు సంబంధించిన రైల్వే సమస్యలను చూడాల్సి ఉంటుంది.
మామూలుగా లోకల్ ఎంపీకే ఈ బాధ్యతలు ఇస్తారు. జీవీఎల్ విశాఖకు నాన్ లోకల్. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు.దాంతో జీవీఎల్ కి బీజేపీలోనే పోటీ ఎదురవుతోంది. కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి విశాఖ మీద ఆశపడుతున్నారని ప్రచారం సాగుతోంది.
జీవీఎల్ అయితే ఉంటే ఢిల్లీలో లేకుంటే విశాఖలో అన్నట్లుగా తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసిపెట్టుకున్నారు. విశాఖ వాసిగా మారిపోయారు. పుట్టిన రోజుతో పాటు అన్ని పండుగలూ విశాఖలోనే జరుపుకుంటూ వస్తున్నారు.
కేంద్ర బీజేపీ పెద్దల వద్ద మంచి సాన్నిహిత్యం ఉన్న జీవీఎల్ వైపే హై కమాండ్ మొగ్గు ఉందని చెప్పడానికి అన్నట్లుగా ఇపుడు కీలక పదవి లభించింది. జీవీఎల్ విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సమస్యల మీద తనదైన వాణిని వినిపిస్తున్నారు. విశాఖలో తన సామాజికవర్గానికి చెందిన వారు రెండు లక్షల మంది ఉన్నారని జీవీఎల్ కేంద్ర పెద్దలకు చెప్పడం తో ఆయనకే టికెట్ కన్ ఫర్మ్ అని అంటున్నారు.