వైసీపీలో నంబర్-2గా నిన్నమొన్నటి వరకూ పిలుచుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు లోకల్ కాదు. కొంత కాలంగా ఆయన జాతీయ అంశాలపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు తదితర అంశాలపై ట్విటర్ వేదికగా సానుకూల పోస్టులు పెడుతూ, అలా రాజకీయాన్ని నెట్టుకొస్తున్నారు. ఏపీకి సంబంధించి చాలా తక్కువగా విజయసాయిరెడ్డి స్పందిస్తుండడం గమనార్హం.
శనివారం ఉదయాన్నే ఆయన ట్విటర్ ఖాతాలో రెండు పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అందులో ఒకటి బుద్ధ భగవానుడి బోధనల గురించి, మరొకటి హిందూ మహాసముద్రంలో చైనా నౌకల ప్రస్తావన. ఈ రెండు పోస్టులు కూడా హిందీలో పెట్టడం విశేషం. ఏపీ రాజకీయాలపై ఆయనకు ఎందుకు విరక్తి కలిగిందో తెలియదు కానీ, పూర్తిగా పొలిటికల్ పంథాను మార్చుకున్నారు. ఇది ఎంత కాలమో తెలియదు. కానీ విజయసాయిరెడ్డి మారిన వైఖరి గమనిస్తుంటే… చాలా పట్టుదలతో ఉన్నారనే అభిప్రాయం కలుగుతోంది.
కనీసం ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలకు కూడా విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. ఏపీలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాల గురించి మాత్రం ఆయన సందర్భోచితంగా పోస్టులు పెడుతున్నారు. సీఎం జగన్ శుక్రవారం వైఎస్సార్ కళ్యాణమస్తు &షాదీ తోఫా పథకాల లబ్ధిదారులకు డబ్బు జమ చేయడంపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు & వైఎస్సార్ షాదీ తోఫా పథకాలు పేద జంటలు తమ వివాహాన్ని గౌరవప్రదంగా జరుపుకునేలా చూస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారులకు నెలవారీ ఆదాయం 10-12,000 కంటే తక్కువ కాబట్టి వారికి ఈ పథకాలు చాలా అవసరమని ఆయన తెలిపారు.
శనివారం ఉదయాన్నే బుద్ధ భగవానుడి గురించి ఈ వైసీపీ బుద్ధుడి కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం. “ఈ రోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధ భగవానుడి బోధనల గురించి ఆలోచించడానికి మనమంతా ఐదు నిమిషాల సమయాన్ని కేటాయిద్దాం. బౌద్ధ బోధనలైన జ్ఞానం, దయ, సహనం, దాతృత్వం కరుణ, ధర్మాన్ని అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. అందరికీ ఆనందకరమైన బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు” అంటూ విజయసాయిరెడ్డి స్వీట్ ట్వీట్ చేశారు.
గతంలో వివాదాస్పద ట్వీట్లు చేస్తుండడంతో మీడియా వాటికి ప్రాధాన్యం ఇచ్చేది. కానీ ఇప్పుడు మర్యాదగా, పద్ధతిగా చేస్తున్న ట్వీట్లను చివరికీ వైసీపీ సొంత మీడియా కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.