కేంద్రం మీద కోపాల్..శాపాల్

లక్షల కోట్ల విలువ చేసే ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం సంకల్పించి రెండేళ్లు పై దాటిపోయింది. కేంద్రం ప్రకటన చేసిన వెంటనే ఉక్కు కార్మికులు దీక్షలు చేపట్టారు. శుక్రవారం నాటికి దీక్ష…

లక్షల కోట్ల విలువ చేసే ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం సంకల్పించి రెండేళ్లు పై దాటిపోయింది. కేంద్రం ప్రకటన చేసిన వెంటనే ఉక్కు కార్మికులు దీక్షలు చేపట్టారు. శుక్రవారం నాటికి దీక్ష 813 రోజుకు చేరుకుంది. ఈ రోజు విశేషం ఏంటంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసన శిబిరం వద్దకు వచ్చి దీక్షను చేపట్టడం.

తెలుగోడి సత్తా ఢిల్లీకి తెలియాలి అంటూ పాల్ పవర్ ఫుల్ స్పీచ్ కూడా ఇచ్చారు. అన్న ఎన్టీయార్ స్పూర్తిగా తీసుకోండి ప్రపంచ తెలుగు వాళ్ళంతా ఏకం కావాలని పాల్ పిలుపు ఇవ్వడం జరిగింది. అత్యంత విలువ చేసే స్టీల్ ప్లాంట్ ని కేవలం ఆరు వేల కోట్లకే కేంద్రం అదానీకి ఇవ్వాలని చూస్తోందని పాల్ మండిపడ్డారు.

ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొనసాగించేలా భారీ ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు. తన వంతుగా విశాఖ ఉక్కు పోరాటంలో భాగం అవుతానని, ఎంత చేయాలో అంతా చేస్తానని పాల్ అంటున్నారు. కేంద్రం ఉక్కు భూములను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు సిద్ధం కావడం దారుణం అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతీ ఒక్కరు తమ శక్తి మేరకు ముందుకు రావాలని, ఈ  విషయంలో ఏ మాత్రం అలసత్వం పనికిరాదని అన్నారు.

కేంద్రానికి పాల్ శాపాలు కూడా పెట్టారు. ఉక్కు ఉసురు పోసుకుంటే గడ్డు కాలమే దాపురిస్తుందని కూడా శపించేశారు. పాల్ స్పీచ్ పవర్ ఫుల్ గా ఉండడమే కాదు విషయం కూడా చాలానే ఉంది. పాల్ ఇటీవల కాలంలో విశాఖ ఉక్కు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాను విశాఖ జిల్లా వాసినే అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని కూడా అంటున్నారు. పాల్ ఉక్కుకు దిక్కుగా ఉన్నారని కార్మికులు అనడమూ విశేషంగానే చూడాలి.