వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం అసలు కనిపించడం లేదు. ఇదే టీడీపీ విషయానికి వస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం బలంగా వుంటుంది. అందుకే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు కలిగి వుంది. 2019లో కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల్లో టీడీపీ గెలుపొందినా, నాలుగేళ్లు గడిచే సరికి అధికార పార్టీకి దీటుగా ఎదురు నిలుస్తోంది. ఇదే మరొక పార్టీ అయి వుంటే, నామరూపాల్లేకుండా పోయేది.
టీడీపీకి కార్యకర్తలే బలం. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. నాయకులే బలమైతే, ఆ పార్టీ ఎంతో కాలం నిలబడేది కాదు. వైసీపీ విషయానికి వస్తే… ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మరొకరిని ఎదగనివ్వడం లేదు. కనీసం చిన్నచిన్న విషయాల్లో కూడా దిగువశ్రేణి నాయకులను కలుపుకుని వెళ్లడం లేదు. ఎన్నికల నాటికి ఇది నష్టం కలిగించే అంశం. అయితే ఎన్నికలప్పుడు ఓటర్లను కొనుగోలు చేస్తామనే భావనలో అధికార పార్టీ నేతలున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క నాయకుడికి సొంతంగా ప్రజాదరణ లేదనేది వైసీపీ ఎమ్మెల్యేల భావన. అందుకే నియోజకవర్గాల్లో ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారు అనుకుంటున్నారు.
ఉదాహరణకు సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో చూద్దాం. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేశ్‌యాదవ్ ఉన్నారు. వీరిని ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, రామమల్లు శివప్రసాద్‌రెడ్డి కలుపుకుని వెళ్లే పరిస్థితి లేదు. ప్రొద్దుటూరులో యాదవ సామాజిక వర్గానికి చెందిన రమేశ్‌కు పదవి ఇవ్వడం వల్ల బీసీల్లో పార్టీని బలోపేతం చేసుకోవచ్చనేది సీఎం జగన్ భావన. కానీ క్షేత్రస్థాయిలో సీఎం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు.
పైగా ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌కు ఏ మాత్రం విలువ ఇవ్వలేదనే భావన బీసీల్లో పెరిగింది. దీంతో ఆ సామాజిక వర్గాల్లో వైసీపీపై వ్యతిరేకతకు దారి తీస్తోంది. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య పైకి గొడవలేవీ కనిపించడం లేదు. కానీ తమ నాయకుడికి కనీస విలువ ఇవ్వడం లేదని రామసుబ్బారెడ్డి అనుచరుల ఆవేదన. ఇది ఎన్నికల్లో వైసీపీని తప్పక దెబ్బ తీస్తుంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూడా ఇదే పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరించిన ఎస్సీవీనాయుడిని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అసలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎస్సీవీనాయుడు వైసీపీలో ఉన్నారా? లేరా? అనేది కూడా ప్రశ్నార్థకమే.
ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీలో అణచివేత చర్యలే కనిపిస్తున్నాయి. ఈ ధోరణి వైసీపీకి ఎంత వరకు మంచి చేస్తుందో పార్టీ నేతలే ఆలోచించాలి.