అనాలోచితంగా మాట్లాడేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసే కీలక నాయకుల్లో విజయసాయిరెడ్డి కూడా ఒకరు. తాజాగా ఆయన రాజ్యసభలో- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే క్రమంలో అలాంటి పనే చేశారు. ఆయన ఏ ఉద్దేశంతోనైనా చెప్పి ఉండొచ్చు గానీ.. నింద వైఎస్సార్ మీదకు మళ్లే వ్యవహారం అది.
ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. వైఎస్ షర్మిల సారథ్యం వహిస్తోంది గనుక.. వైసీపీ ఓట్లను కాస్త చీల్చగలదేమో అనే అంచనా. ఇన్నాళ్లూ ఏపీలో ఏ పార్టీ కూడా కాంగ్రెసును తమ ప్రత్యర్థిగా పట్టించుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. కాంగ్రెస్ పార్టీని కూడా వైసీపీ వారు చాలా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను తిట్టడానికి విజయసాయిరెడ్ది విభజన అంశాన్ని, ప్రత్యేకహోదా రాకపోవడానికి కాంగ్రెసే కారణమనే విషయాన్ని ప్రస్తావించారు.
ఈ క్రమంలో 2004లోనే కాంగ్రెసు పార్టీ తెలంగాణ హామీని మేనిఫెస్టోలో చేర్చిందని, వాళ్లు కావాలనుకుంటే దానిని హేతుబద్ధంగా చేసి ఉండొచ్చునని అన్నారు. ఈ మాటలు వైఎస్సార్ ను కార్నర్ చేసేలా ఉన్నాయి. 2004 మేనిఫెస్టోలో ఉన్న హామీ ఆచరణలోకి రాలేదంటే.. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్సార్.. తెలంగాణకు అడ్డుపడ్డారని, కాంగ్రెస్ హామీ నెరవేర్చకుండా చూశారని అర్థం వస్తుంది.
కాంగ్రెస్ కేవలం ఎన్నికల ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నించిందని అంటున్న విజయసాయి మాటలు వైఎస్సార్ కు ఆపాదించబడతాయి.
ఈ సంగతి పక్కన పెడితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం త్వరలోనే పతనం కానుందని కూడా విజయసాయి రాజ్యసభలో జోస్యం చెప్పేశారు. అసలే తెలంగాణలో గులాబీదళాలు కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందనే ప్రచారం చేస్తుండగా.. విజయసాయి మాటలు వారికి మద్దతిస్తున్నట్టుగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి జగన్.. తెలంగాణ కాంగ్రెస్ సర్కారును కూల్చడానికి కేసీఆర్ కు సహకరిస్తారనే కొత్త పుకారు పుట్టడానికి విజయసాయి బీజం వేసినట్లు అయింది. కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసింది అనే అంశం వరకు ఆయన పరిమితమై ఉంటే చాలా బాగుండేది. అలా కాకుండా.. ఇప్పుడు సొంత పార్టీనే ఇరుకున పెట్టే వాతావరణం సృష్టించారు.