రాజకీయం ఒక వ్యసనం పదవి ఒక వ్యామోహం అని అంటారు. రాజకీయాల్లోకి ప్రవేశించడమే తప్ప పదవీ విరమణ అన్నది అసలు ఉండదు. ఆ పరుగు ఆపడం దేవుడి తరం కూడా కాదు. ఒకసారి ఎమ్మెల్యే అయిన వారు తమను పక్కన పెట్టడాన్ని తట్టుకోలేరు. తాము గెలిచేస్తామని వారి లెక్కలు వారికి ఉంటాయి.
అందుకే ఒక పట్టాన ఆశలు చంపుకోలేరు. చివరాఖరు వరకూ తమదైన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వైసీపీ అధినాయకత్వం చాలా మార్పులు చేస్తోంది. అనేక మందిని తప్పిస్తోంది. అలాగే చాలా మందికి షిఫ్టింగులు ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా కొత్త వారు అభ్యర్థి కావడం అంటే రాజకీయాలలో కొత్త ట్రెండ్ గానే చూడాలి.
ఇంకా చేతిలో అధికారం ఉంది. తాము ఎమ్మెల్యేగా పోటీ చేయబోము అన్నది తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పరిస్థితిని విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎదుర్కొంటున్నారు అని ఆయన సహచరులు అంటున్నారు. నిన్నటిదాకా ఒక సాధారణ కార్పోరేటర్ గా ఉన్న నేత రేపటి ఎమ్మెల్యే అభ్యర్ధి అంటే ఇబ్బందే.
అయినా పార్టీ కోసం కట్టుబడి పనిచేయాలి తప్పదు. అయితే ఇంచార్జిల పనితీరు బాగా లేకపోయినా మారుస్తారు అన్న ప్రచారం ఉంది. అందుకే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. గాజువాక ఎమ్మెల్యే కూడా ఇప్పటిదాక ఇతర నాయకులతో రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్థాయిలో తన ప్రయత్నాలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఆయనకు గాజువాక నియోజకవర్గం సమస్యలు అని చెప్పారు. నిధులను కేటాయించి పరిష్కరించాలని కోరారు. అయితే సీఎం ని కలసింది నియోజకవర్గం అభివృద్ధి కోసమే అయినా తన సీటు విషయం మరోసారి చర్చించి వీలైతే తన కుమారుడికి దక్కించుకునే ప్రయత్నం చేసేందుకే అని ప్రచారం సాగుతోంది.
నియోజకవర్గంలో పార్టీ తరఫున చేపడుతున్న కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రికి వివరించి వైసీపీని మళ్లీ గెలిపించుకుని వస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే తమ కుటుంబానికే టికెట్ దక్కేలా నాగిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు సీఎం నుంచి ఏ మేరకు హామీ లభించింది అన్నది తెలియడంలేదు.