ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్టు విశాఖకు రైల్వే జోన్ రాకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్టు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు.
విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశంలో రైల్వే జోన్ అంశం చర్చకే రాలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖకు రైల్వేజోన్ సాధించేందుకు వైసీపీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. విశాఖకు రైల్వేజోన్ వచ్చి తీరుతుందని ఆయన తేల్చి చెప్పారు.
విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై అక్కసుతోనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మండిపడ్డారు. విశాఖకు రైల్వేజోన్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికాధిపతులు రామోజీరావు, రాధాకృష్ణ అవాస్తవాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
తప్పుడు రాతలపై రామోజీ, రాధాకృష్ణ సమాధానం చెప్తారా? అని ఆయన నిలదీశారు. అవాస్తవాలను ప్రచురించి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని మీడియాధిపతులకు విజయసాయి హితవు పలికారు. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటనపై ఎల్లో మీడియా తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. బీజేపీ ఎంపీలు కూడా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని చెబుతుండడం విశేషం.