ఆఖరాఖరుకు చూడబోతే చట్టం పక్కకు పోతోంది. విభజన చట్టం హామీలు కూడా పూర్తిగా సైడ్ అయిపోతున్నాయి. తెలంగాణా నుంచి విడిపోయిన ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని రావాలని అంతా కోరుకున్నారు. కానీ ఇపుడు అది చట్ట పరిధిని దాటి రాజకీయ నిర్ణయం వైపుగా వెళ్ళిపోయింది అని అంటున్నారు.
రాజకీయ నిర్ణయం అయితే అందులో రాజకీయ లాభాలే ఉంటాయి. మనకు పొలిటికల్ గా ఎంతవరకూ ఫీజుబిలిటీ ఉంటుంది అని మాత్రమే ఎవరైనా ఆలోచిస్తారు. అంతే తప్ప హామీలు చట్టాలు అపుడు ద్వితీయ ప్రాధాన్యతలు అయిపోతాయి. విశాఖ రైల్వే జోన్ కి ఫీజుబిలిటీ లేదని రైల్వే బోర్డ్ ఏనాడో చెబుతూ వచ్చింది. అయితే చట్టం లో ఉంది కాబట్టి పెట్టాలని ఏపీ నుంచి కోరుతున్నారు. ఇపుడు అది కాస్తా రాజకీయ నిర్ణయం దిశగా సాగుతోంది అని అంటున్నారు.
విశాఖ లో రైల్వే జోన్ పెడితే బీజేపీకి ఒరిగేదేముంది. విశాఖ ఎంపీ సీటు కానీ ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ ఆ పార్టీకి సొంతంగా వస్తాయా. పొత్తులు లేకుండా ఏపీలో బీజేపీ కమలం ఎక్కడైనా వికసించగలదా. ఇవన్నీ అందరికీ తెలిసిన ప్రశ్నలే.
ఆ విధంగా ఆలోచించినపుడు రైల్వే జోన్ అన్నది పొలిటికల్ గా కూడా ఫీజుబిలిటీ లేదు అన్నదే తేలిపోతున్న అంశం. లాభం లేకపోతే ఏమీ ఎక్కడా చేయరాదు అన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు చెబుతూ ఉంటారు. ఏపీకి ఆ విధంగానే చూసీ చూడనట్లుగానే చాలా విభజన హామీలు అటకెక్కించారు అన్నది కూడా తెలిసిందే.
మొత్తానికి రైల్వే జోన్ వచ్చినట్లేనా ఆ కూత వినిపిస్తుందా అంటే బీజేపీ రాజకీయ నిర్ణయం బట్టే అది ఆధారపడి ఉంటుంది. ఏపీలోనే బీజేపీకి పెద్దగా రాజకీయ లాభం లేని చోట ఆ పార్టీ పెదలు రైల్వే జోన్ ఇస్తారా అన్నది ఈ రోజుకైతే ధర్మ సందేహమే.