గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కల సాకారమవుతున్న వేళ రానే వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి కీలక ప్రకటన చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే వెంకటరామిరెడ్డి చేసిన ప్రకటన సారాంశం. జగన్ ప్రభుత్వం రాగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా నెలకొల్పారు. ఒకేసారి లక్షకు పైబడి రెగ్యులర్ ఉద్యోగులను నియమించి ఔరా అనిపించారు. రెండేళ్లకు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. జగన్ ప్రభుత్వం చెప్పిన ప్రకారం గత ఏడాది అక్టోబర్ నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి వుండాలి.
కానీ అలా జరగలేదు. దీంతో తమకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తారా? చేయరా? అనే అనుమానం సచివాలయ ఉద్యోగులను వెంటాడుతోంది. మరోవైపు ప్రతిపక్షాల హెచ్చరికలు సచివాలయ ఉద్యోగుల అనుమానానికి అగ్గికి ఆజ్యం పోసినట్టైంది. ఈ రకమైన అనుమానాలు, భయాల మధ్య ఇవాళ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించడం విశేషం.
రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు లేదా రేపు వస్తాయని వెంకటరామిరెడ్డి తెలిపారు.
ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సచివాలయ ఉద్యోగులకు పాత పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ, సీఎం జగన్ దాన్ని పక్కన పెట్టారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలు పొందుతారని స్పష్టం చేశారు. దీంతో సచివాలయ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేవు.