ఈ మధ్య చంద్రబాబు నుంచి ఛోటా నాయకుల వరకూ పోలీసులకి ఒకటే హెచ్చరికలు. త్వరలోనే మేము వస్తాం. అతి చేసిన పోలీసుల సంగతి చూస్తాం అంటూ ఒకటే బ్లాక్మెయిల్. గతంలో వైసీపీ వాళ్లు చేయలేదని కాదు, దొందూ దొందే. ఎన్నికలు దగ్గరికొచ్చే సరికి పోలీసులపైన ఒత్తిడి పెరుగుతుంది.
50 లక్షలు ఇస్తాం, మా మనుషుల్ని వదిలేయండి, లేదంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత మేము వస్తాం, మీ అంతు చూస్తామంటూ శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌రెడ్డి బెదిరించడం వెనుక తాము గ్యారెంటీగా అధికారంలోకి వస్తామనే ధీమా వుంది. ఇంతకీ వీళ్లు వదిలేయమని అడిగింది ఎవరిని అంటే గంజాయి అమ్మేవాళ్లని.
నిజానికి పోలీసుల్ని పార్టీ అవసరాలకి వాడడం చంద్రబాబుతోనే ప్రారంభమైంది. అంతకు ముందున్న అంజయ్య, విజయభాస్కర్‌రెడ్డి హయాంలో ఇది చాలా తక్కువ.
ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు రాకతో ప్రారంభమైంది. ప్రతి వ్యవస్థనీ మేనేజ్ చేయడం తప్ప, సొంతంగా ప్రజాస్వామ్య బద్ధంగా పని చేసే అలవాటు బాబుకి లేదు. 1995లో పోలీస్ అధికారుల్ని తన వైపు తిప్పుకుని ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నాడు. చివరికి పెద్దాయనపై చెప్పులు కూడా వేయించి, ఇపుడేమో ఎన్టీఆర్ శతజయంతి అని స్పీచ్‌లు ఇస్తున్నాడు.
పోలీసులు అధికార పార్టీ నేతలకి అనుగుణంగా పని చేస్తారనే విషయం తెలియని వాడు కాదు బాబు. తాను సీఎంగా ఉన్నపుడు పోలీసులతో ఊడిగం చేయించుకున్నాడా? లేదంటే స్వేచ్ఛగా పని చేయనిచ్చాడా? అనేది ఆయనే చెప్పాలి. ఇప్పుడేమో వైసీపీ కనుసన్నల్లో పోలీస్‌శాఖ ఉందని ఆరోపణలు. పోలీసులు తప్పు చేస్తే కోర్టులకు వెళ్లొచ్చు. అంతే కానీ ప్రతిరోజూ పోలీసుల అంతు తేలుస్తానని బెదిరించడం కరెక్టా? ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే బాబు, పోలీసుల్ని బెదిరించడం ఏ ప్రజాస్వామ్యం కిందికి వస్తుందో?
పోలీసుల విషయానికి వస్తే వాళ్లు నిష్పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే పార్టీలకి అతీతంగా పని చేస్తే లూప్లైన్లో వేస్తారు. దాంతో వాళ్లు డీలా పడి రాజీపడతారు. కొందరు మాత్రం ఎక్కడ పనిచేసినా తమ ముద్ర వేస్తారు.
వెనుకటికి ఒక ఐపీఎస్ అధికారిని ఆర్టీసీలో వేస్తే, దాన్ని బాగు చేసి చూపించాడు. టూరిజంలో వేస్తే ఆ దరిద్రపు శాఖలో కూడా లాభాలు చూపించాడు. అంత ఆత్మవిశ్వాసం వున్న వాళ్లు అరుదు. మెజార్టీ అధికారులు గాలివాటంతో పోతారు.