తిరుమల శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. ఆర్జిత, వీఐపీ బ్రేక్ దర్శనాలతో ప్రతి రోజూ ఉదయం తిరుమల ఆలయం ప్రముఖులతో రద్దీగా వుంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ఉన్నతాధికారులు ప్రకటించారు. అందుకే సోమవారం వాటికి సంబంధించి సిఫార్సు లేఖలు తీసుకోలేదు.
శ్రీవారి ఆలయంలో మంగళవారం ఆణివార ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కారణంగానే ఉదయం వేళ సేవలన్నీ రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం వేళ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పుష్పపల్లకీపై మాఢవీధుల్లో శ్రీవారు విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
తిరుమలకు తమిళ సంప్రదాయానికి విడదీయని అనుబంధం వుంది. తమిళ సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజు కావడంతో ఉత్సవాలకు ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది. ఈ పర్వదినం నాడు స్వామి వారికి శ్రీరంగం దేవస్థానం తరపు వారు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.