సుదీర్ఘంగా సాగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుక ముగిసింది. రాత్రి జరిగిన శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంతో ఈ వేడుకలు పూర్తయ్యాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, భారత్ లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన విరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ ఈ వివాహ వేడుకతో ఒకటయ్యారు.
ప్రపంచ దేశాలన్నింటినీ కలిపిన వివాహ వేడుక వీళ్లది. ఈ పెళ్లి కోసం ముకేశ్ అంబానీ అక్షరాలా 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కేవలం ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసమే దాదాపు 1250 కోట్ల రూపాయలకు పైగా ఆయన ఖర్చు చేశారు. ప్రపంచంలోనే ఖరీదైన వివాహంగా ఇది నిలిచిపోయింది.
మార్చి 1 నంచి అనంత్-రాధిక ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఈ సెలబ్రేషన్స్, అంగరంగ వైభవంగా జరిగాయి. అక్కడ తగినన్ని హోటల్స్ లేకపోవడంతో.. అతిథుల కోసం 7-స్టార్ రేంజ్ వసతులతో తాత్కాలికంగా లగ్జరీ టెంట్ హౌజ్ లు నిర్మించారు. ఒక్కో గుడారం నిర్మించడానికి 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేశారు.
కేవలం ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసమే 2500 రకాల వంటకాలతో మెనూ సిద్ధం చేశారు. ఈ వేడుకల్లో వరల్డ్ ఫేమస్ పాప్ గాయని రిహన్నా ప్రదర్శన ఇచ్చింది. దీని కోసం ఆమెకు ఏకంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారంట. ఈ వేడుకలకు 2000 మంది అతిథులు రాగా.. ప్రతి ఒక్కరికి బంగారం, డైమండ్స్ తో తయారుచేసిన ప్రత్యేకమైన బహుమతిని అందించారు.
అనంత్ అంబానీ పెళ్లి కార్డు ఓ వింత. ఒక్కో వెడ్డింగ్ కార్డు తయారీకి దాదాపు లక్షన్నర రూపాయలు వెచ్చించారు. అలా వేలాది కార్డులు తయారుచేసి అతిథులకు అందించారు. అందులోనే వేడుకలకు సంబంధించిన ఎంట్రీ పాసులు, మెనూ, వసతి ఏర్పాట్లు, దగ్గరుండి చూసుకునే సిబ్బంది వివరాలు అన్నింటినీ పొందుపరిచారు. ప్రతి సెలబ్రిటీకి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వేడుకకు వచ్చినప్పట్నుంచి వెళ్లే వరకు వాళ్లే అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు.
ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు 2500 రుచులో భోజనాలు పెట్టిన అంబానీ కుటుంబం… పెళ్లికి ఏకంగా 3వేల రకాల రుచులు వడ్డించింది. ప్రపంచం నలుమూలల్లో దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాల్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించారు. ఆహుతులకు పూర్తిస్థాయిలో వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్ ను రుచిచూపించారు. కేవలం ఈ భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. కొంతమంది అతిథులకు ముకేశ్ అంబానీ స్వయంగా తన చేతులతో వడ్డించారు.
అంబానీ పెళ్లికి తారలు తరలివచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా.. హాలీవుడ్ నుంచి కూడా విశిష్ట అతిథులు పెళ్లికి హాజరయ్యారు. ఎటుచూసినా హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలే. అనంత్ పెళ్లి కోసం ఎంతోమంది తారలు ఆడిపాడారు. ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి ఆర్ఆర్ఆర్ లోని నాటు-నాటు పాటకు డాన్స్ చేయగా… బారత్ లో మరోసారి అంతా కలిసి చిందేశారు. రజనీకాంత్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటు క్రికెటర్లు, ఇటు తారలు కలిసి డాన్స్ చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదు జనాలకి.
ఇక చివరి రోజు శుభ్ ఆశీర్వాద్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరింతమంది రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చిన ఆహుతులందరికీ మరోసారి ఖరీదైన బహుమతులు అందాయి. ఈసారి బంగారంతో చేసిన కోటి 50 లక్షల రూపాయల ఖరీదైన వాచీల్ని బహుమతులుగా అందించారు. ఇలా తన చిన్న కొడుకు పెళ్లిని చరిత్రలో నిలిచిపోయేలా చేశారు ముకేశ్ అంబానీ