చేజేతులా స‌మ‌స్య తెచ్చుకుంటున్న రేవంత్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రాజ‌కీయ చ‌ర్య‌లు బీజేపీ అధికారానికి బాట వేస్తున్న‌ట్టుగా వుంది. బీఆర్ఎస్‌ను నామ‌రూపాల్లేకుండా చేయ‌డం వ‌ల్ల కాంగ్రెస్‌కు వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంటో అర్థం కావ‌డం లేద‌నే కామెంట్స్ సొంత పార్టీ నుంచే…

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రాజ‌కీయ చ‌ర్య‌లు బీజేపీ అధికారానికి బాట వేస్తున్న‌ట్టుగా వుంది. బీఆర్ఎస్‌ను నామ‌రూపాల్లేకుండా చేయ‌డం వ‌ల్ల కాంగ్రెస్‌కు వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంటో అర్థం కావ‌డం లేద‌నే కామెంట్స్ సొంత పార్టీ నుంచే వ‌స్తున్నాయి. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకుంటే, ఇక తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష‌మే వుండ‌ద‌ని రేవంత్‌రెడ్డి క‌ల‌లు కంటున్నార‌ని, పూర్తిగా ఆయ‌న రాంగ్‌రూట్‌లో ప‌య‌నిస్తున్నార‌నే భావ‌న కాంగ్రెస్ నాయ‌కుల్లో బ‌లంగా వుంది.

బీఆర్ఎస్‌ను రాజ‌కీయంగా స‌మాధి చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యత్నం లేకుండానే బీజేపీ బ‌ల‌ప‌డుతుంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో స‌మానంగా బీజేపీ 8 సీట్లు ద‌క్కించుకోవడాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రికంటే ఎక్కువ‌గా రేవంత్‌రెడ్డిపైనే వుంది. బీఆర్ఎస్ బ‌తికి వుంటే, కాంగ్రెస్‌కు రాజ‌కీయంగా మేలు. అప్పుడు ట్ర‌యాంగిల్ పోటీలో మ‌ళ్లీ కాంగ్రెస్‌కు అవ‌కాశం వుంటుంది.

అలా కాకుండా కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ అయితే మాత్రం… ప్ర‌స్తుత అధికార పార్టీకి నూక‌లు చెల్లిన‌ట్టే అని పెద్ద ఎత్తున చ‌ర్చ జరుగుతోంది. గ‌త ప‌దేళ్ల‌లో కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేల‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకుని కేసీఆర్ సాధించిందేమీ లేద‌ని తెలిసి కూడా రేవంత్‌రెడ్డి కూడా అదే బాట‌లో న‌డ‌వ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

పాల‌న‌పై, అలాగే నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై రేవంత్‌రెడ్డి దృష్టి సారించ‌కుండా, కేవ‌లం ఫిరాయింపుల‌నే రేవంత్‌రెడ్డి న‌మ్ముకుంటే కాంగ్రెస్ కొంప మునుగుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అన్నీ తెలిసి కూడా రేవంత్‌రెడ్డి ఎందుకిలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వుంది. ప‌శ్చిమ‌బెంగాల్‌లో క‌మ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల‌ను అణ‌చివేసి, చేజేతులా బీజేపీ ఎదిగేలా మ‌మ‌తాబెన‌ర్జీ చేసుకున్నార‌ని గుర్తు చేస్తున్నారు. ఇప్ప‌టికైనా లోపాల్ని గుర్తించి, స‌క్ర‌మ మార్గంలో పాల‌న సాగించాల‌ని రేవంత్‌రెడ్డిని ప‌లువురు కోరుతున్నారు.