వీడియో కాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల కనిపించడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆ వీడియోలో ఉన్నది తాను కానని, మార్ఫింగ్ చేశారని ఆయన అన్నారు. వీడియో కాల్లో గోరంట్ల మాధవ్ ఉండడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే గోరంట్ల స్పందించారు. మీడియాకు వివరణ ఇచ్చారు.
నగ్న వీడియో సృష్టించడం వెనుక చింతకాయల విజయ్, పొన్నూరు వంశీ తదితరులు ఉన్నారన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. చెత్త వీడియోని పోస్టు చేసి తనను డ్యామేజీ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తనను ఇబ్బంది పెట్టడానికి టీడీపీ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు.
టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం వుంటే నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అది నిజమైన వీడియో అని నిరూపిస్తే తల నరుక్కుంటా అని గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్య చేశారు.
జిమ్‌లో తాను పాల్గొన్న వీడియాలను తీసుకుని, మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా జిమ్ చేసే వీడియోలను ఆయన ప్రదర్శించారు. ఇలాంటి వీడియోలను తీసుకుని, చెత్త చెత్త క్రియేషన్స్ చేశారని మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
ఇప్పటికే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు గోరంట్ల మాధవ్ తెలిపారు. నిజానిజాలు తేల్చాలని కోరుతున్నట్టు మాధవ్ వెల్లడించారు.
ఈ అసభ్య వీడియోలను సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తనపై వచ్చిన వీడియోలు ముమ్మాటికీ ఫేక్ అని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్‌కు పంపి నిగ్గు తేలుస్తామన్నారు.