ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న విరాటపర్వం మేకర్స్, నిన్నట్నుంచి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చారు. ఓ సర్ ప్రైజ్ ఉందంటూ ఊరిస్తూ పోస్టులు పెట్టారు. ఈరోజు ఆ సస్పెన్స్ ఏంటనేది రివీల్ చేశారు. సినిమాను అనుకున్న తేదీ కంటే 2 వారాల ముందే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అదే సర్ ప్రైజ్.
లెక్కప్రకారం జులై 1 న విరాటపర్వం రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడీ సినిమాను జూన్ 17కే థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టు సాయిపల్లవిని, నక్సలైట్ గెటప్ లో రానాను చూపించారు.
నిజానికి జూన్ 17కి రామారావు ఆన్ డ్యూటీ సినిమా రావాలి. కానీ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను వాయిదా వేశారు. దీంతో ఆ తేదీని విరాటపర్వం అందుకుంది.
ఇప్పటికే చాలా లేట్ అయిన ఈ సినిమా ఇలా కొన్ని రోజుల ముందు రావడం కాస్త మంచి విషయమే. కాకపోతే ప్రమోషన్ కు టైమ్ తగ్గిపోయింది. మిగిలిన ఈ కొద్ది రోజుల్లో ఈ సినిమాకు ఏ రేంజ్ లో ప్రచారం కల్పిస్తారో చూడాలి.
రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.