సౌత్ సినిమా, హిందీ సినిమా అంటూ వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి గత కొంతకాలంలో దక్షిణాది భాషల్లో రూపొందిన వివిధ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్రలు చేస్తున్న తరుణంలో, సౌత్ లో స్టార్ల సినిమాలకు పాన్ ఇండియా సినిమాలు అంటూ ప్రత్యేక ట్యాగ్ లైన్లు ఏర్పడుతూ ఉండటంతో ఈ చర్చ, వాదనలు జరుగుతూ ఉన్నాయి.
ఈ అంశంపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సౌత్ స్టార్ల ఆధిపత్యాన్ని బాలీవుడ్ భరించలేకపోతోందనే విశ్లేషణ కూడా బయల్దేరింది. మరి ఈ అంశంపై స్పందించడానికి తగిన అర్హుల్లో కమల్ హాసన్ ముందు వరసలో ఉంటారు.
తన సొంత భాష చిత్ర పరిశ్రమతో ప్రస్థానం మొదలుపెట్టి.. వివిధ భాషల్లో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు కమల్. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కమల్ కు ఆయా భాషల స్టార్ హీరోలతో దాదాపు సమానంగా ఉంది. ఇక హిందీలో కూడా కమల్ ప్రస్థానం ఈనాటిది కాదు. నాలుగు దశాబ్దాల క్రితమే హిందీలో కూడా సూపర్ హిట్స్ ను కొట్టిన ఘనత ఉంది. క్రమం తప్పకుండా గత నాలుగు దశాబ్దాల్లో కమల్ సినిమాలు వివిధ భాషల్లోకి అనువాదం అవుతూ ఉన్నాయి. తమిళానికి ధీటుగా వేరే భాషల్లోనూ కమల్ సినిమాలు విడుదలవుతున్నాయి.
హిందీలో కూడా కమల్ చూడని స్టార్ డమ్ ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై కమల్ స్పందించారు. తన తాజా సినిమా ప్రమోషన్ లో భాగంగా కమల్ స్పందిస్తూ.. సౌత్ సినిమా, హిందీ సినిమా అంటూ వేరు చేసి చూడవద్దని.. అన్ని సినిమాలనూ కలిపి ఇండియన్ సినిమాగా వ్యవహరించాలని అంటున్నాడు కమల్. సౌత్ లో ఇప్పుడు భారీ సినిమాలు వస్తున్నది నిజమే అని, ఆ భారీ సినిమాల రూపకల్పనను తాము హిందీ నుంచి చూసే నేర్చుకున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కమల్ విశ్లేషించాడు.
ఒక మొఘల్ ఏ అజామ్, మరో షోలే వంటి సినిమాలతో తామెంతో నేర్చుకున్నట్టుగా కమల్ చెప్పాడు. తన ఏక్ దుజే కేలియే వంటి సినిమాను ఏ భాషలో అయినా మరొకరు తీయగలరని, అయితే మొఘల్ ఏ అజామ్, షోలే వంటి వాటిని మరొకసారి, మరో భాషలో తీయలేమని కమల్ అన్నాడు. అలాంటి సినిమాల స్ఫూర్తితో తాము కూడా ప్రయోగాలు చేయగలిగామని.. ఈ విషయంలో భాషా బేధాలు అవసరం లేదని కమల్ అన్నాడు.