విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా తూర్పు అసెంబ్లీ సీటుని చెప్పుకోవాలి. విశాఖ రెండవ నియోజకవర్గం 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా విశాఖ తూర్పు గా మారింది. ఇప్పటికి మూడు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మూడు సార్లూ టీడీపీయే గెలవడం విశేషం. అలా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వెలగపూడి రామక్రిష్ణబాబు నిలిచారు.
ఈ నియోజకవర్గంలో గడచిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీ గెలవాలని విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఫలితం దక్కడంలేదు. ఈసారి వెలగపూడి సామాజిక వర్గానికే చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను తెచ్చి పోటీకి పెడుతున్నారు. ఆయన అంగబలం అర్ధబలం తో విశాఖ తూర్పులో మార్పు తీసుకుని వస్తారని వైసీపీ ఆశపడుతోంది.
మూడు సార్లు గెలిచిన వెలగపూడి మీద జనంలో కొంత వ్యతిరేకత ఉంది. అదే తమకు శ్రీరామ రక్ష అని వైసీపీ అనుకుంటోంది. ఈసారి కొత్త ముఖానికి అవకాశం ఇవ్వాలని వైసీపీ ఇంచార్జిగా ఉన్న ఎంవీవీ జనాలను కోరుతున్నారు.
విశాఖ తూర్పులో రెండు లక్షల 73 వేల దాకా ఓటర్లు ఉన్నారు. పెద్ద నియోజకవర్గంగా ఉంటుంది. బీసీలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం పూర్వ స్వరూపం విశాఖ రెండు. టీడీపీ ఎక్కువ సార్లు ఆనాడు కూడా గెలిచింది. రెండు సార్లు మాత్రమే కాంగ్రెస్ అప్పట్లో గెలిచింది.
అయితే వరసగా మూడు సార్లు టీడీపీ గెలిచిన చరిత్ర నాడు లేదు. ఒకే అభ్యర్ధి మూడు సార్లు గెలిచి నాలుగవ సారి పోటీ చేయడం కూడా జరగలేదు. ఇది 2024 ఎన్నికల్లో టీడీపీకి మేలు చేస్తుందా లేక జనాలకు బోరెత్తించి ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీకి బలం చేకూరుస్తుందా అంటే ముందు ముందు జరిగే పరిణామాలను గమనించాలి..
విశాఖ తూర్పు అసెంబ్లీ సీటుని గెలిచి జగన్ కి బహుమానంగా ఇస్తామని ఎంవీవీ సత్యనారాయణ ధీమాగా చెబుతున్నారు. తూర్పులో టీడీపీ వైసీపీ అభ్యర్ధులు ఇద్దరూ సమ ఉజ్జీలే. ఎవరికి ఎవరూ తీసిపోరు. వీరి గెలుపు విషయంలో తూకం వేసి తీర్పు చెప్పాల్సింది అత్యధికంగా ఉన్న బీసీలు. వారు ఏ పార్టీ వైపు ఉంటారు అన్నదే విశాఖ తూర్పు రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది.