భూ దందాలు విశాఖలో గత కొన్నేళ్ళుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ హయాంలో ఒక సిట్ ని నియమించారు. అది విచారణ చేసి నివేదిక ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరోసారి సిట్ వేసింది. ఆ నివేదిక ఏమైందో తెలియదు.
వైసీపీ అయిదేళ్ళ పాలనలో భూ దందాలు అధికం అయ్యాయని విపక్షాలు ఎపుడూ ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఇపుడు రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. విశాఖ భూ దందాల మీద నిగ్గు తేలుస్తామని టీడీపీ జనసేన నేతలు అంటున్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే విశాఖ ఫైల్స్ ని త్వరలో రిలీజ్ చేస్తామని చెబుతున్నారు విశాఖ ఫైల్స్ లో మొత్తం వైసీపీ నేతల భూ దందాలు ఉంటాయని ఆయన అంటున్నారు. ఉన్నతాధికారులు చేసిన భూ దందాలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇవన్నీ వెలుగు చూడడంతో పాటుగా సమగ్రమైన విచారణ జరిపిస్తామని చెప్పారు.
అయితే విశాఖ ఫైల్స్ లో మొత్తం ఏపీ విభజన నుంచి ఇప్పటిదాకా జరిగిన భూ దందాల మీద పూర్తి వివరాలు ఉంచాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అన్నింటి మీద పూర్తి విచారణ జరిపిస్తే భూ అక్రమార్కులకు సరైన గుణపాఠం చెప్పినట్లు అవుతుందని అంటున్నారు.
విభజన తరువాత పెద్ద నగరంగా ఉన్న విశాఖ మీద భూ అక్రమార్కుల కళ్ళు పడ్డాయని దాంతో వందల వేల ఎకరాలు దోచేశారు అన్న ఆరోపణలు ఉన్న నేపధ్యంలో అన్నింటి మీద సమగ్రమైన విచారణ జరిపిస్తేనే విశాఖ భూ దందాల నుంచి బయటపడుతుందని అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ విచారణ ఉంటేనే సరైన ఫలితం వస్తుందని అంటున్నారు.