విశాఖ సౌత్ నియోజకవర్గ సీటు విషయమై జనసేనలో రచ్చ పతాక స్థాయికి చేరింది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్ విశాఖ సౌత్ టికెట్‌ను ఆశిస్తున్నారు. దాదాపు ఆయనకే టికెట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిఖార్సైన నేతలు అతనికి టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఐదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన వంశీకృష్ణ అధికార దర్పాన్ని ప్రదర్శించారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అధికారంలో వుంటూ జనసేన కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకృష్ణ లాంటి అవకాశ వాదికి టికెట్ ఇవ్వొద్దంటూ జనసేన కార్పొరేటర్ సాధిక్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
ఒకవేళ అతనికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని వారు హెచ్చరించారు. తామేం మేకలు కాదంటూ… సింబాలిక్‌గా వాటితో నిరసనకు దిగారు. ఈ విషయం తెలిసి వంశీకృష్ణ యాదవ్ అనుచరులు అక్కడికెళ్లి వీర మహిళలపై దాడికి తెగబడ్డారు. కార్పొరేటర్ సాధిక్ అనుచరులు కూడా తిరగబడ్డారు. ఈ వ్యవహారం విశాఖ ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
వంశీకృష్ణ యాదవ్‌కు టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేకిస్తున్న జనసేన నాయకులు మాట్లాడుతూ రేస్ గుర్రం కావాలని తాము అడుగుతున్నామన్నారు. కానీ బలి పశువును పంపుతున్నట్టు సమాచారం వుందన్నారు. గతంలో వంశీకృష్ణయాదవ్ 50 వేల మెజార్టీతో ఓడిపోయాడని, అలాంటి స్థానికేతరుడిని తీసుకొచ్చి తమపై రుద్దడం ఏంటని సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.