చంద్రబాబునాయుడు, లోకేశ్ పేరు వింటే చాలు విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఎగిరిపడతారు. టీడీపీలో తనను అవమానించారనే ఆవేదన కేశినేని నానిలో వుంది. తన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తూ, తనను పొమ్మనకుండా పొగ పెట్టారని కేశినేని నాని ఆవేదన. టీడీపీ నుంచి ఆయన బయటపడడం, ఆ వెంటనే కేశినేని నానికి విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని సీఎం జగన్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.
తాజాగా చంద్రబాబునాయుడిపై కేశినేని నాని ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు ఎన్నో పాట్లు పడ్డారన్నారు. బాబుకు ఒక్క ముక్క కూడా హిందీ రాదన్నారు. తెలుగులో రాసుకొచ్చి హిందీలో చదివాడని దెప్పి పొడిచారు.
ఒకప్పుడు మోడీని టెర్రరిస్టు అని విమర్శించిన చంద్రబాబే, ఇప్పుడు గొప్పవాడని పొగడ్తల వర్షం కురిపించాడని విమర్శించారు. రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లిలా తయారయ్యారని వెటకరించారు. స్కామ్ నుంచి బయటపడడానికి మోదీ, అమిత్‌షా కాళ్లు పట్టుకుని పొత్తు కుదుర్చుకున్నారని విమర్శించారు.
ఇటు పవన్‌కల్యాణ్‌ని , అటు బీజేపీని చంద్రబాబు మోసగిస్తున్నాడని కేశినేని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పచ్చి మోసగాడని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.