ఎన్నికల్లో గెలవడం ముఖ్యం. ఏదో విధంగా జనాల అభిమానం చూరగొనాలి. లేదా జనాలను ఆశపెట్టాలి. ఆంధ్ర సీఎం జగన్ బటన్ లు నొక్కుతూ పోతుంటే, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. సోమాలియా అయిపోతుంది అని నానా యాగీ చేసారు. అభివృద్ది లేదని కిందా మీదా గోల పెట్టారు.
కానీ జనం పట్టించుకోకపోవడంతో, వారికి బటన్ నొక్కడమే కావాలి అని అర్థం అయింది. దానికి తోడు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, వాటికి జనం మొగ్గు చూపిన వైనం చూసాక ఇక హామీలకు హద్దు ఎందుకు వుంటుంది.
అధికారంలోకి వచ్చాక, హామీల అమలుకు రూల్స్ రెగ్యులేషన్లు పెట్టొచ్చు. ముందు అయితే అందరికీ బస్ ఫ్రీ అనేయడం, అందరికీ కరెంట్ ఫ్రీ అనేయడం, ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చేస్తాం అనడం కాంగ్రెస్ కు కలిసివచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రలో ఈ హామీలనే కాపీ కొడుతూంది.
కానీ గతంలో తాము చేసిన శ్రీలంక, సోమాలియా విమర్శలు మళ్లీ తమకే అడ్డం వస్తాయని, కొత్త డ్రామా మొదలుపెట్టారు. అభివృద్ది చేసి, ఆ డబ్బులతో సంక్షేమం అమలు చేస్తామని అంటున్నారు. ఇన్ని లక్షల కోట్లు ఏ విధంగా అభివృద్ది ఆదాయంతో సాధ్యమవుతుంది అన్నది మాత్రం చెప్పరు. ఏ మీడియా అడగదు.
ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని వాగ్దానాలు దేశ ఓటర్ల మీదకు వదిలింది. నిరుద్యోగులకు ఏడాదికి లక్ష, మహిళలకు ఏడాదికి లక్ష అంటూ కొత్తగా ప్రకటించింది. రిజర్వేషన్ల మీద పరిమితే తీసేస్తాం అంటోంది. ఇంతకన్నా ఆకర్షణీయమైన వాగ్దానాలు ఎవరు మాత్రం వద్దంటారు.
ఇప్పుడు ఏడాదికి లక్ష అంటూ హామీలు, వచ్చే ఎన్నికలకు అవి ఎంత వరకు పెరుగుతాయో? అన్నది ఆలోచిస్తేనే కాస్త భయంగా వుంటుంది. జనాలను కూర్చో పెట్టి డబ్బులు ఇవ్వడం అన్నది ఒక్కరితో ఆగడం లేదు. ఒకరిని మించి ఒకరు అందిపుచ్చుకుని పెంచుకుంటూ పోతున్నారు. ఇవి కనుక జనంలో బలంగా వెళ్తే ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి.
కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే, గత అయిదేళ్ల పాటు అప్పులు.. అప్పులు అంటూ చెప్పుకువస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అయినా, తేదేపా అయినా ఆ అప్పులను కొనసాగించాల్సిందే. అయితే ఏ మేరకు అప్పులు చేస్తామన్నది కూడా చెప్పాలి. అధికారంలోకి వస్తే ఈ అప్పులు ఏ మేరకు పెరుగుతాయన్నది కూడా చెప్పాలి.
మేనిఫెస్టోలోనే అప్పులు ఏ మేరకు పెంచుతారు? ఎవరికి అమలు చేస్తారు. ఎవరికి అమలు చేయరు అన్నది క్లియర్ గా చెబితే అప్పుడు హామీలను ఏ మేరకు నమ్మాలి అన్నది జనం డిసైడ్ చేసుకుంటారు.