అపుడెపుడో నాలుగేళ్ళ క్రితం రైల్వే జోన్ విశాఖకు ఇచ్చేశామంటూ విశాఖలో మీటింగ్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. రైల్వే జోన్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది కేంద్రం.
ఇపుడు కొత్త బడ్జెట్ ని ప్రవేశపెడుతోంది. ఈ బడ్జెట్ లో విశాఖకు వరాలు ఉంటాయా లేక వేటు వేయడాలే కొనసాగుతాయా అని అంతా చూస్తున్నారు. విశాఖ జనాభా 41 లక్షల పై దాటింది. విశాఖ ఏపీకి ఉన్న అతి పెద్ద మెగా సిటీ.
ఏపీని ఏమైనా బాగు చేయాలన్నా అభివృద్ధి చూపించాలన్నా విశాఖ మీదనే కేంద్రం దృష్టి పెట్టాల్సి ఉంది. విశాఖ మెట్రో రైల్ అన్నది దశాబ్దాల నాటి కలగా ఉంది. గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 76.9 కిలోమీటర్లతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని రూపొందించాలనుకుంటోంది.
దానికి సంబంధించిన డీపీయార్ ని కేంద్రానికి కూడా అందించింది. మెట్రో రైలు విషయంలో కేంద్రం తాజా బడ్జెట్ లో ఏమి చెప్పబోతోంది అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది. అదొక్కటే కాదు విశాఖను టూరిజం స్పాట్ గా డెవలప్మెంట్ చేయడానికి కేంద్ర బడ్జెట్ లో ఏ మాత్రం నిధులు ఇస్తారు అన్నది చూడాలి.
విశాఖ నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు కొత్త రైళ్ళు కావాలని కోరుతున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కోరుతున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్ లో విశాఖకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తారో ఏ మాత్రం నిధులు విదిలిస్తారో అన్నది చూడాల్సి ఉంది.
విశాఖ వంటి నంబర్ వన్ సిటీ అభివృద్ధికి ఉదారంగా కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రికి లేఖ రాశారు. మోడీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కొద్ది రోజులలో తేలిపోతుంది.