ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు…ఉక్కు అంటే లెక్క లేదా…?

విశాఖ ఉక్కులో ఈ రోజు భారీ పేలుడు సంభవించింది. లిక్విడ్ స్టీల్ విస్ఫోటనం చెందడంతో 11మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎంఎస్‌-2 లిక్విడ్ విభాగంలో ఫ్లాగ్ యాష్‌ని తొలగిస్తుండగా నీళ్లు పడటంతో పేలుడు సంభవించింది.…

విశాఖ ఉక్కులో ఈ రోజు భారీ పేలుడు సంభవించింది. లిక్విడ్ స్టీల్ విస్ఫోటనం చెందడంతో 11మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఎంఎస్‌-2 లిక్విడ్ విభాగంలో ఫ్లాగ్ యాష్‌ని తొలగిస్తుండగా నీళ్లు పడటంతో పేలుడు సంభవించింది. క్షతగాత్రులలో  నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  గాయపడిన వారిలో నలుగురు స్లీట్ ప్లాంట్ ఉద్యోగులు కాగా, మరో ఐదుగురు కాంట్రాక్ట్‌ వర్కర్స్‌గా తెలుస్తోంది.విశాఖ ఉక్కు పరిశ్రమలో పేలుడు ప్రమాదంలో డీ జీ ఎం స్థాయి అధికారి కూడా ఉన్నారు.

ఇది వరసగా జరిగిన మరో ప్రమాదంగా ఉక్కు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. దీనికి ఎవరు కారణం అని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం భీష్మించుకొని కూర్చుంది. నాటి నుంచి విశాఖ ఉక్కు విషయంలో పెద్దగా దృష్టి పెట్టడంలేదు. వరసబెట్టి ఉక్కులో పోస్టులు ఖాళీ అవుతున్నాయి. కీలక విభాగాలలో వేలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం చూస్తే అయిదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి ఖాళీగా ఉన్నాయని పనులు ఆగవు కదా. ఇతర విభాగాల నుంచి తెచ్చి కీలక మైన విభాగాలలో పని చేయిస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ వారిని తెప్పించి చేయిస్తున్నారు. వారికి అతి ముఖ్యమైన విభాగాల్లో అనుభవం అవగాహన ఉండదు.

దాంతో వారు ఏకంగా అగ్ని గుండాన్నే తాకుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేస్తూ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. దీనికి కేంద్రం పోస్టులను భర్తీ చేయకుండా ఉండడమే కారణం అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం కమిటీ ప్రతినిధి అయోధారాం అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఉదాశీన వైఖరి వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అమాయక కార్మికులు బలి అవుతున్నారని ఆయన అంటున్నారు.

ప్రమాదకర ప్రదేశాలలో  వేసుకోవడానికి కనీసం ఎఫ్ ఆర్ కోటులు కూడా ఇవ్వలేదని, భద్రతా పరమైన చర్యలు కూడా తీసుకోవడంలేదని ఆయన అంటున్నారు అంటే కేంద్ర పెద్దలు ఆలోచించాల్సిందే. విశాఖ ప్రైవేట్ కి వెళ్తుందో లేదో తెలియదు కానీ దాని పట్ల సాగుతున్న ఉపేక్ష వల్ల మాత్రం కార్మికులు ఉసురు పోతోందని అంటున్నారు. కేంద్రం సీరియస్ గా విశాఖ ఉక్కు విషయంలో చర్యలు తీసుకోవాలి, ఖాళీలు ముఖ్యమైన విభాగాల్లో తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది.