బీజేపీ కీలక నేత టీడీపీలోకి జంప్ ఖాయమా…?

బీజేపీ మాజీ ఎమ్మెల్యే విశాఖ ఉత్తర నియోజకవర్గం నాయకుడు విష్ణు కుమార్ రాజులో ఆదుర్దా పెరిగిపోతోంది. ఏపీలో బీజేపీ ఏమైపోతోందో అన్న కంగారు పుట్టుకువస్తోంది. నిజానికి చూస్తే ఈ బాధ బాధ్యత అంతా ఢిల్లీలో…

బీజేపీ మాజీ ఎమ్మెల్యే విశాఖ ఉత్తర నియోజకవర్గం నాయకుడు విష్ణు కుమార్ రాజులో ఆదుర్దా పెరిగిపోతోంది. ఏపీలో బీజేపీ ఏమైపోతోందో అన్న కంగారు పుట్టుకువస్తోంది. నిజానికి చూస్తే ఈ బాధ బాధ్యత అంతా ఢిల్లీలో ఉండే హై కమాండ్ పెద్దలు చూసుకుంటారు. కానీ రాజు గారి బాధ ప్రపంచ బాధ కాదు, సొంత బాధ. ఆయన 2024 ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న బాధ,.

ఆయన 2014లో లాస్ట్ మినిట్ లో బీజేపీ టికెట్ తెచ్చుకుని టీడీపీ పొత్తుతో గెలిచారు. ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నారు. బీజేపీ మాత్రం టీడీపీతో దూరం అంటోంది. ఈ బాధను భరించలేని ఆయన గుండెని తెరచి మరీ టీడీపీ అనుకూల మీడియా టీవీ చానల్ లో కక్కాల్సింది కక్కేశారు. ఆ బాధలో కోపంలో ఏపీలో బీజేపీకి ఒక్క సీటూ రాదని తానే ప్రధాని మోడీకి చెప్పానని చెప్పుకున్నారు.

ఇలా సొంత పార్టీ మీద ఆయన ఆ ఇంటర్వ్యూలో చాలానే వ్యతిరేక కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. దీని మీద ఆగ్రహించిన బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన నుంచి వివరణను కోరిందని ప్రచారం సాగుతోంది. రాజు గారు బహుశా ఇలాంటి దాని కోసమే వేచి ఉంటే కనుక కాషాయం కండువాను తెంపుకుంటారనే అంటున్నారు.

ఆ టీడీపీ అనుకూల మీడియా ఆయన్ని ఏరి కోరి పిలవడం బట్టే ఆయన రూట్ సెపరేట్ అని బీజేపీ పెద్దలు గ్రహించారు అని అంటున్నారు. ఆ మీడియా అధిపతికి టీడీపీ హై కమాండ్ తో ఉన్న చనువుతో తాను వారి కంట్లో పడడం ద్వారా టీడీపీలోకి జంప్ చేసి టికెట్ సాధించాలని ఆయన చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. 

మీడియా ముందు పెద్ద నోరు చేసుకుని వైసీపీ మీద విమర్శలు చేసే ఈ రాజు గారికి ఉత్తరంలో ఉన్న బలమెంత అన్న దాని బట్టే టీడీపీ చేర్చుకుంటుందా లేక వచ్చారు కదా అని కండువా కప్పేస్తుందా అన్నది రెండు పార్టీలలో డిస్కషన్ గా ఉందిట. రాజు గారు బీజేపీని వీడిపోవాలనుకుంటే మాత్రం ఈ షోకాజ్ నోటీసులు ఆయనకు లెక్క కాదు అనే అంటున్నారు. అయినా అన్నీ ఆలోచించే ఆయన టీడీపీ అనుకూల మీడియా ముందుకెళ్ళి నవ్వుకుంటూ మాట్లాడారు అని అంటున్నారు.