అక్రమకేసు అని ఎమ్మెల్యే తనయ ఒప్పుకుంటున్నారా?

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని కక్షల మయమైన రాజకీయాలలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై కేసు నమోదు అయింది. పులివర్తి నాని మీద జరిగిన దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కుమారుడు, ఈ…

చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని కక్షల మయమైన రాజకీయాలలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై కేసు నమోదు అయింది. పులివర్తి నాని మీద జరిగిన దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కుమారుడు, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద ఈ కేసు నమోదు కావడం గమనార్హం.

ఈ కేసులోని నిజానిజాలను దర్యాప్తులో పోలీసులు తెలుస్తారు. ఎవరు దోషులనేది కూడా ప్రజల దృష్టికి వస్తుంది. అయితే ఈలోగా రాజకీయ ప్రకటనలు రకరకాలుగా ఉండడం సహజం. ఆ క్రమంలో ‘తన కుమారుడి మీద అక్రమ కేసు బనాయించారంటూ’ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. దానికి తెలుగుదేశం ఎమ్మెల్యే గారి కూతురు ఇస్తున్న కౌంటర్ చూస్తే, కావాలనే ఆ కేసు పెట్టారా అని అనిపిస్తుంది.

తమాషా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో- పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను వివిధ కేసులలో అరెస్టు చేశారు. సహజంగానే అప్పుడు కూడా తెలుగుదేశం ఇది రాజకీయ అరెస్టుగా అక్రమ కేసుగా ఆరోపణలు చేసింది. ఆ వ్యవహారం ప్రస్తుతానికి కోర్టులో నలుగుతోంది. ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పై కేసు నమోదు కాగానే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూతురు తెరమీదకు వచ్చారు. ‘ఇప్పుడు మీకు బాధ తెలుస్తోందా’ అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆమె ప్రశ్నిస్తున్నారు.

‘‘మా నాన్నను అన్యాయంగా ప్రతీకార రాజకీయాలతో అరెస్టు చేశారు. అప్పుడు మా కుటుంబ సభ్యులు అనుభవించిన బాధ ఏమిటో ఇప్పుడు మీకు తెలుస్తుందా?’’ అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూతురు నాగసాయి వైదీప్తి ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. విషయం ఏంటంటే ఇది పూర్తిగా అక్రమ కేసు అనే ఆరోపణను ధ్రువీకరిస్తున్న తరహాలో ఉంది. మీరు మా వాళ్ల మీద కేసులు పెట్టారు కనుక మేము మీ మీద కేసులు పెట్టించాం.. కుటుంబంలో ఎవరి మీదైనా కేసులు పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థం అవుతోందా.. అని అర్థం వచ్చేలాగా ఆమె ట్వీట్ ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సాధారణంగా ఇలాంటి సందర్భాలలో ‘‘తప్పు చేస్తే కేసు పెట్టకుండా ఉంటారా? అక్రమ కేసు అవునా కాదా న్యాయస్థానంలో తేలుతుంది’’ లాంటి డైలాగులతో నాయకులు ప్రతిస్పందిస్తుంటారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కూతురు స్పందన చిత్రంగా, అది అక్రమ కేసు అని ధ్రువీకరించే లాగా ఉన్నదని పలువురు అంటున్నారు.

6 Replies to “అక్రమకేసు అని ఎమ్మెల్యే తనయ ఒప్పుకుంటున్నారా?”

Comments are closed.