2024 ఎన్నికలను వైసీపీ, టీడీపీ, జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు వుంది. జగన్‌ను అధికారం నుంచి దించేసి, సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా జగన్‌ను గద్దె దించాలని పవన్‌కల్యాణ్ కూడా బాబు కంటే గట్టిగా కోరుకుంటున్నారు. అయితే తాను సీఎం కావాలని మాత్రం ఆయన పట్టుదలతో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక జగన్ విషయానికి వస్తే…ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కేవలం సెకెండ్ చాన్స్ ఇవ్వాలనే నినాదంతో జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. 2019లో ఇచ్చిన హామీలను అమలు చేసి వుంటేనే ఓట్లు వేయాలని జగన్ అప్పీల్ చేయడం నిజంగా సాహసమే.
కారణాలేవైనా జగన్ ప్రభుత్వంపై జనంలో విపరీతమైన వ్యతిరేకత వుందని చంద్రబాబు నమ్ముతున్నారు. అదే తనకు అధికారం తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారుతోందనే భయాన్ని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నిజనిజాలతో సంబంధం లేకుండా జగన్ పాలన అంటే భయపడేలా చేసి, మరోసారి ఆయన నాయకత్వానికి ఆదరణ దక్కకుండా చేయాలనే వ్యూహంతో చంద్రబాబు ముందుకెళుతున్నారు.
కానీ పవన్‌కల్యాణ్ రాజకీయ పంథా ఏంటో అర్థం కావడం లేదు. సంక్షేమ పాలనకు పెద్దపీట వేస్తున్న తనకు మరోసారి జనం పట్టం కడుతారని జగన్ విశ్వాసంతో ఉన్నారు. జగన్‌పై వ్యతిరేకతే తనను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తుందనే నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. మరి జనసేనను జనం ఎందుకు ఆదరిస్తారో కనీసం పవన్‌కల్యాణ్‌కైనా తెలుసా? ఇప్పుడిదే అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రధాన ప్రశ్న.
తనను అధికారంలోకి తెస్తే నవరత్నాల సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కర్నీ లక్షాధికారులను చేస్తానని జనానికి హామీ ఇచ్చి, ప్రజాదరణ పొందారు. పవన్‌కల్యాణ్ ఆ రీతిలో చేస్తున్న దాఖలాలు లేవు. తాను అధికారంలోకి వస్తే ఫలానా సంస్కరణలు తెస్తానని, అణగారిన వర్గాల కోసం ఫలానా మంచి పని చేస్తానని చెప్పడం లేదు.
ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా వుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారం కోసం వైసీపీ, టీడీపీ ఢీ అంటే ఢీ అని పోట్లాడుతుంటే, వాటి మధ్యలో పొత్తులు, ఎత్తులు అంటూ అడగకనే జనసేనాని ఏవేవో మాట్లాడుతుంటారు. ఇదో విచిత్రమైన పరిస్థితి. పవన్‌కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏంటో కాలమే తేల్చాల్సి వుంది.