హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి- ఎన్టీఆర్ పేరును తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఏపీ ప్రభుత్వం నామకరణం చేసింది. దీనికి సంబంధించిన బిల్లు బుధవారం నాడు శాసనసభలో ఆమోదం పొందింది.
సహజంగానే ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీ వారికి కంటగింపుగా మారింది. శాసనసభలోను బయట కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారందరూ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తీవ్రంగానే నిరసించారు. వారి నిరసనలను అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ కు అసలు ఏమిటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీకి రూపకల్పన చేసినది నందమూరి తారక రామారావు కదా అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి తమ హయాంలో ఎన్టీఆర్ పేరు పెట్టామనేది ఆయన చెబుతున్న మాట. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టినందుకు తెలుగు ప్రజలు జగన్ ను క్షమించరని కూడా చంద్రబాబు నాయుడు ఆక్రోశం వెళ్లగకుతున్నారు.
అయితే పేరు మార్పు కారణాలను జగన్ చాలా స్పష్టంగానే చెప్పారు. అన్ని మెడికల్ కాలేజీలను.. ‘హెల్త్ యూనివర్సిటీ అనే ఒక గొడుగు కిందకు తెచ్చారు తప్ప.. ఎన్టీఆర్ ఒక్క మెడికల్ కాలేజీ అయినా కొత్తగా పెట్టిందిలేదు. ఇది జగన్ చెప్పిన వాదన.. ప్రజల్లో ఇంకో గట్టి వాదన కూడా వినిపిస్తోంది.
ఆ మాటకొస్తే హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావుకు ఏమిటి సంబంధం? ఆయనేమీ కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టలేదు. విడివిడిగా యూనివర్సిటీలతో అనుసంధానమే ఉన్న మెడికల్ కాలేజీలను అన్నింటినీ కలిపి ఒక యూనివర్సిటీగా రూపకల్పన చేశారు. అందుకని మరణానంతరం ఆ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలా? అసలు హెల్త్ అనే విభాగానికి ఒక సినిమా నటుడికి ఏమిటి సంబంధం? అనేది ప్రజల మధ్యలో మెదడుతున్న ప్రశ్న!
చంద్రబాబు నాయుడుకు స్ఫురించలేదేమో గాని వైయస్సార్ పేరు పెట్టడమే హెల్త్ యూనివర్సిటీకి కరెక్ట్ నిర్ణయం! ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి స్వతహాగా డాక్టర్! రాజకీయాల్లోకి రాకముందు ప్రజల వద్ద అతి తక్కువ ఫీజులు తీసుకుని వైద్య సేవలు అందించిన ప్రజల మనిషి. ఆ తర్వాతనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది. ఒక వైద్యుడిగా ప్రజా జీవితంలో ఉంటూ రాజకీయంగా అత్యున్నత స్థానానికి ఎదగడంతో పాటు రాష్ట్ర ప్రజల హృదయాలలో చెరపలేని చోటు సొంతం చేసుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడమే హెల్త్ యూనివర్సిటీకి సబబుగా శోభిస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
అంతగా ఉంటే ఏపీలో ప్రభుత్వం ఒక ఫిలిం సిటీ నిర్మించినా, చిత్ర నిర్మాణ రంగానికి సంబంధించి ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టినా.. నటుడిగా ప్రస్థానం ప్రారంభించి ముఖ్యమంత్రి ఆయన ఎన్టీఆర్ పేరు పెట్టడం బాగుంటుందనేది వారి సూచన,
అలా కాకుండా పేరు మార్చారు కదా అని అడ్డగోలుగా విమర్శలు చేస్తూ ప్రతి విషయాన్ని రాజకీయానికి వాడుకోవాలని చంద్రబాబు నాయుడు దీనిని రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని ప్రజలు అంటున్నారు.
అయినా మామ స్థాపించిన పార్టీని ఆయనకు వెన్నుపోటు పొడిచి మరీ సొంతం చేసుకున్న, ఎన్టీఆర్ ఆనవాళ్లు కూడా ఆయన స్థాపించిన పార్టీ మీద లేకుండా చేసేసి ఆయనను పొట్టన పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు.. ఆరోగ్య యూనివర్సిటీకి నటుడు పేరు తీసేసి డాక్టర్ పేరు పెడితే విలపించడం భావ్యం కాదు అని ప్రజలు అంటున్నారు!