చంద్రబాబులో జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఆకర్షించే మహత్యం ఏంటి? ఇప్పుడీ అంశం చర్చనీయాంశమైంది. పవన్‌కల్యాణ్‌పై ప్రత్యర్థులు ప్రధానంగా చేసే విమర్శ…మూడు పెళ్లిళ్లు చేసుకోవడం. మహిళల జీవితాలతో పవన్ ఆడుకుంటున్నారని, ఆయనకు స్త్రీలంటే ఏ మాత్రం గౌరవం లేదనే విమర్శ ప్రత్యర్థుల నుంచి బలంగా వస్తోంటోంది. తనకు పెళ్లిళ్లు కలిసి రాలేదని, విడాకులు ఇచ్చిన తర్వాతే చట్టబద్ధంగా వైవాహిక జీవితానికి సంబంధించి నడుచుకున్నానని ఆయన సమాధానం ఇస్తుంటారు.
మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో మరింత వివరణ ఇచ్చారు. వైసీపీ నేతలు మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారని అసహనం వ్యక్తం చేశారు. మీరూ చేసుకోండి ఎవరు కాదన్నారని చెప్పుకొచ్చారు. మొదటి భార్యకు విడాకులిచ్చి రూ.5 కోట్లు, రెండో భార్యకు మిగిలిన ఆస్తి ఇచ్చానన్నారు. ఆమెకు విడాకులిచ్చాకే మూడో పెళ్లి చేసుకున్నట్టు పవన్ చెప్పారు.
భరణంతో భార్యలను విడిపించుకున్న పవన్‌కల్యాణ్, రాజకీయ జీవితంలో మాత్రం విడిపోయిన వ్యక్తితో మళ్లీ కలవడం ఆసక్తి కలిగిస్తోంది. చంద్రబాబుతో 2014లో పొత్తు పెట్టుకుని రాజకీయ ప్రయాణం సాగించారు. ఆ తర్వాత మూడున్నరేళ్లకు బాబుతో విడిపోయారు. తన తల్లిని లోకేశ్ టార్గెట్ చేయించి, ఓ పథకం ప్రకారం ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టించారని పవన్ అప్పట్లో చిందులు తొక్కారు. తనను అంతమొందించాలని కూడా టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
అలాగే తన తల్లిని దుష్ప్రచారం చేయిస్తున్న ఎల్లో మీడియా చానళ్లను బహిష్కరించాలంటూ ఆయన అప్పట్లో పిలుపునిచ్చారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో పవన్‌కల్యాణ్ అవన్నీ మరిచిపోయినట్టున్నారు. కానీ జనం మరిచిపోలేదనే సంగతిని పవన్ గుర్తు పెట్టుకుంటే మంచిది.
రాజకీయంగా వద్దే వద్దనుకున్న చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు ఏ అంశం కారణమైందనే చర్చ నడుస్తోంది. పవన్‌ను కట్టపడేసే ప్రేమ చంద్రబాబులో ఏముందబ్బా? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. సాధారణంగా చంద్రబాబు అధికారాన్ని తప్ప మరెవరినీ ప్రేమించరనేది ప్రచారంలో వుంది. అలాంటిది విడిపోయినా, మళ్లీ కలుసుకునేంత గొప్పగా చంద్రబాబు ఏం పంచారనే ప్రశ్న వెల్లువెత్తింది. చంద్రబాబులో ప్రేమ లేదని, ఆయనకు పదవీ కాంక్ష తప్ప, మనుషులపై ఆప్యాయత వుండదనే ప్రచారం తప్పా? అనే చర్చ కూడా నడుస్తోంది.
చంద్రబాబులో ఏదో తెలియని సమ్మోహనశక్తి వుందని, అదే పవన్‌ని ఆవహించి వుంటుందని జనసేన కార్యకర్తలు కూడా నమ్ముతున్నారు. ఇంతకూ తనను తాను చంద్రబాబుకు అర్పించుకునేలా పవన్‌ను మార్చేసిన శక్తి ఏంటబ్బా? లక్షలాది పుస్తకాలు చదివిన జ్ఞానసంపన్నుడు పవన్‌కల్యాణ్ సమాధానం చెప్పి… చంద్రబాబుపై మచ్చల్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది.