కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలో సాగుతోంది. ఆంధ్రాలో ఆయన యాత్ర రెండో రోజుకు చేరింది. కర్నూలు జిల్లాలో ప్రవేశించిన రాహుల్ యాత్ర… ఇవాళ ఆదోనిలో కొనసాగుతోంది. రాహుల్‌గాంధీ దృష్టిలో పడేందుకు కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు తహతహలాడుతున్నారు.
అయితే ఏపీకి చెందిన కీలక నాయకుడు రాహుల్ పాదయాత్రలో కనిపించకపోవడం చర్చకు తెరలేచింది. రాహుల్ వెంట ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, జేడీ శీలం, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క నడుస్తున్నారు. కానీ ఉమ్మడి ఏపీకి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడా కనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ విభజనను సీఎంగా కిరణ్ తీవ్రస్థాయిలో విభేదించిన సంగతి తెలిసిందే. లాస్ట్ బాల్ అంటూ విభజనను ఆపుతానని కిరణ్ ఊరించారు. కానీ ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోకుండానే రాష్ట్రాన్ని నాటి కాంగ్రెస్ ఏలుబడిలోని కేంద్ర ప్రభుత్వం విభజించింది. కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ, ఆ పార్టీ నుంచి కిరణ్ బయటికొచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేయకపోయినా, ఆయన తమ్ముడిని తన పార్టీ తరపున బరిలో నిలిపారు. అయినా ఫలితం లేకపోయింది.
సొంత పార్టీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి ఆయన చేరారు. కానీ రాజకీయంగా ఆయన యాక్టీవ్‌గా లేరు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ఏపీలో చేపట్టినా, ఆ రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకుడిగా కిరణ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీలో చేరేందుకు కిరణ్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారని సమాచారం.