చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటున్నారా?

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఏపీ బీజేపీ నేత‌ల తీరు ఉంది. అవినీతి, కుటుంబ పార్టీల‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని, జ‌న‌సేన‌తో క‌లిసి 2024 ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని ఏపీ బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెబుతున్న…

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఏపీ బీజేపీ నేత‌ల తీరు ఉంది. అవినీతి, కుటుంబ పార్టీల‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని, జ‌న‌సేన‌తో క‌లిసి 2024 ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని ఏపీ బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ దాదాపు విడిచిపెట్టారు. ఇక అధికారికంగా విడాకులు ప్ర‌క‌ట‌నే రావాల్సి వుంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌వ‌హార‌శైలిపై మొద‌టి నుంచి బీజేపీకి అనుమానం ఉన్న‌ప్ప‌టికీ, ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో త‌మను కాద‌ని వెళ్లేందుకు ధైర్యం చేయ‌ర‌ని బీజేపీ న‌మ్ముతూ వ‌చ్చింది. పుణ్య‌కాలం కాస్త క‌రిగిపోయింది. జ‌న‌సేనాని లేకుండా భ‌విష్య‌త్‌లో అనుస‌రించాల్సిన రాజ‌కీయ పంథాపై చ‌ర్చించేందుకు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుతో ఢిల్లీ పెద్ద‌లు మాట్లాడార‌ని స‌మాచారం.

విశాఖ గ‌ర్జ‌న‌, అదే రోజు మంత్రుల‌పై జ‌న‌సేన రౌడీ మూక‌ల దాడి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు నోటీసులు, హోట‌ల్ గ‌దికే ఆయ‌న్ను ప‌రిమితం చేయ‌డం, ఆ త‌ర్వాత విజ‌య‌వాడ రాక‌, చంద్ర‌బాబుతో భేటీ త‌దిర రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా చోటు చేసుకున్నాయి. బీజేపీని అడిగినా రోడ్ మ్యాప్ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే తాను ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ విమ‌ర్శించ‌డం ద్వారా, ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప‌క్కా ప్లాన్ ర‌చించుకున్నార‌ని చెప్పొచ్చు.

త‌న‌ వెంట బీజేపీ రావాల్సిందే త‌ప్ప‌, తాను వెళ్లేది లేద‌ని ప‌వ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు. చంద్ర‌బాబు దారే త‌న ర‌హ‌దారి అని ప‌వ‌న్ బీజేపీకి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికీ జ‌న‌సేనాని త‌మ వెంట వ‌స్తాడ‌ని, పొత్తు త‌మ మ‌ధ్యే అని బీజేపీ నేతలు చెబుతూ జ‌నాన్ని మోస‌గిస్తారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. మ‌రోవైపు 2024 ఎన్నిక‌ల‌కు సోము వీర్రాజు నేతృత్వంలోనే వెళ్తామ‌ని బీజేపీ తేల్చి చెప్పింది. వైసీపీ, టీడీపీల‌కు స‌మాన దూరంలో సోము వీర్రాజు వుంటున్నారు.

టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాల‌ని బీజేపీలో ఆ పార్టీ కోవ‌ర్టుల ఎత్తుగ‌డ‌లు సోము వీర్రాజు ముందు ఫ‌లించ‌డం లేదు. దీంతో టీడీపీతో బీజేపీ పొత్తు సందేహ‌మే. ఈ నేప‌థ్యంలో బీజేపీ భ‌విష్య‌త్ వ్యూహం ఉత్కంఠ రేపుతోంది.