జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు కలిసి చర్చలు జరపగానే, కలిసి మీడియాతో మాట్లాడగానే, వైసీపీ నేతలపై పవన్ ఇదివరకు ఎన్నడూ లేనంత తీవ్రంగా నిప్పులు కురిపించగానే జనసేన, టీడీపీ పొత్తు ఖరారై పోయిందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం సాకారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ – బాబు కలయిక, పవన్ బీజేపీకి ఇచ్చిన సంకేతాలనుబట్టి చూస్తుంటే ఆ పార్టీ డైలమాలో పడ్డ పరిస్థితి కనబడుతోంది. వీళ్ళతో కలుస్తుందా? ఒంటరి పోరు సాగిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఎన్నికల్లో వైసీపీపై ఒంటరిగా పోరాడలేకనే బాబు, పవన్ ఒక్కటయ్యారన్న వాదన వినబడుతోంది. వైసీపీని గద్దె దింపాలనే కసి ఇద్దరిలోనూ ఉంది. టీడీపీ బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్ర బీజేపీ నాయకులు దీన్ని కొట్టి పారేసినా కేంద్ర నాయకత్వంలో ఈ ఆలోచన ఉంది. పవన్ – బాబు కలిసిన నేపథ్యంలో బీజేపీ ఏం చేయబోతుంది? బీజేపీకి జనసేన విడాకులు ఇచ్చినట్లే. టీడీపీ-జనసేన పొత్తుకు రంగం సిద్దమవుతుండగా.. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పరిస్దితి అగమ్య గోచరంగా మారిందని పరిశీలకులు అంటున్నారు.
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత బాబు -పవన్ మళ్లీ కలిసి ముందుకు సాగాలని తీసుకున్న నిర్ణయం ప్రభావం అధికారపక్షమైన వైసీపీపై ఏమాత్రం ఉండబోతోందన్న చర్చ ఓవైపు సాగుతుండగా.. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పరిస్ధితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. బీజేపీని వదిలించుకోవడం ఖాయమేనన్న సంకేతాలు ఇచ్చిన పవన్.. దానిపై ఫుల్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.దీంతో కాస్త సస్పెన్స్ నెలకొన్నా అంతిమంగా గుడ్ బై చెప్పడం తప్పదనిపిస్తోంది. రాష్ట్రంలో మూడేళ్లుగా బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతోంది. అయినా ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టలేకపోయారు.
దీంతో ఈ రెండు పార్టీల బంధం ఎన్నికల వరకు కొనసాగదని అందరూ అనుకున్నారు. బీజేపీ మొదటి నుంచి చాలా విషయాల్లో జనసేనను కలుకుపోలేదు. అందుకే పవన్ ఆ పార్టీకి తాము ఊడిగం చేయబోమన్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ తమ రాజకీయ అవసరాల కోసం వైసీపీని వాడుకుంటూ ప్రతిగా మద్దతిస్తోంది. కేవలం అమరావతి విషయంలో మినహా కేంద్రం వైసీపీ వైఖరికి భిన్నంగా వెళ్లింది లేదు. దీంతో బీజేపీ అధిష్టానం రూటు మార్చుకుని తమతో కలిసి వస్తుందని ఆశించిన పవన్ కళ్యాణ్.. తగిన సహకారం లేకపోవడంతో ఇక కమలానికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
ఇదే విషయంపై సోముకు కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను అనేకసార్లు బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని, కానీ, ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇంకా వేచి చూస్తే.. తమ పరిస్థితి ఇబ్బందుల్లో పడేలా ఉందని పవన్ అన్నారు. అంతేకాదు.. ఇంకా వేచి చూసే పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉరుములు లేని పిడుగులా.. వెళ్లి..టీడీపీ అదినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే.. తాను బాబుతో భేటీ అయింది ఎన్నికలకు సంబందించిన విషయంపై కాదని.. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను చూస్తూ ఉండలేక.. సమైక్యంగా పోరాడాలనే ఉద్దేశంతోనేనని పవన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అందరూ కలిసి రావాలని.. కోరుతున్నానని చెప్పారు.
వారు బీజేపీ అయినా..కమ్యూనిస్టులు అయినా.. వైసీపీయేతర ఏ పార్టీ అయినా కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. దీంతో బీజేపీ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఎందుకంటే తాము పవన్‌తో పొత్తుతో ఉన్నామని చంద్రబాబుతోను టీడీపీతోను కలిసి పనిచేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే అనూహ్యంగా పవన్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబు విషయంలో బీజేపీ ఇప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకోలేదనేది వాస్తవం. నిన్న మొన్నటి వరకు కూడా.. పార్టీని చంద్రబాబును కూడా వ్యతిరేకించారు.
అయితే.. ఇప్పుడు తమకు ప్రధాన మద్దతుదారుగా ఉన్న పవనే వెళ్లి చంద్రబాబుతో చేతులు కలిపిన తర్వాత అనివార్య పరిస్థితి బీజేపీ ముందుకు వచ్చింది. 2014లో జరిగిన పొత్తుల మాదిరిగానే ఇప్పుడు కూడా చేతులు కలిపితేనే మంచిదని బీజేపీలోని ఓ వర్గం నాయకులు చెబుతున్నారు. అయితే.. సోము వీర్రాజు వంటి కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు మాత్రం టీడీపీతో తమకు పనిలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ పోత్తుల బంతిని బీజేపీ కోర్టులోకే నెట్టేశారు. మరి కమలనాథులు ఏం తేల్చుకుంటారో చూడాలి.