పవన్ కల్యాణ్ ఏం చేయాలి..? ఏం చేస్తున్నారు..?

దసరా తర్వాత జనాల్లోకి వస్తానంటూ ఊరిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే సినిమాలకు కూడా కాస్త విరామం ఇచ్చారు. నిజంగానే పవన్ రైట్ ట్రాక్ లో వెళ్తున్నారా..? ఎక్కడైనా దారి తప్పారా..? అసలు జనం పవన్…

దసరా తర్వాత జనాల్లోకి వస్తానంటూ ఊరిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే సినిమాలకు కూడా కాస్త విరామం ఇచ్చారు. నిజంగానే పవన్ రైట్ ట్రాక్ లో వెళ్తున్నారా..? ఎక్కడైనా దారి తప్పారా..? అసలు జనం పవన్ కల్యాణ్ కి కానీ, జనసేకి కానీ ఎందుకు ఓటు వేయాలి..?

ప్రతిపక్ష ఓటు చీల్చను అని స్టేట్ మెంట్ ఇచ్చారు పవన్ కల్యాణ్, ఆ తర్వాత ఆయన మూడు ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఒకటి సింగిల్ గా పోరాడటం. ఈమధ్య ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అంటున్న పవన్ కల్యాణ్.. సింగిల్ గా బరిలో దిగుతారని అనుకుంటున్నారంతా.. మరి అలాంటప్పుడు ఆయన రాజకీయం ఎలా ఉండాలి..? జనసేన ఒంటరిగా పోటీచేసేట్టయితే ఆయన విమర్శలు కేవలం వైసీపీ పైనే ఉంటే దాన్ని జనం హర్షిస్తారా..?.

ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జనంలోకి వస్తున్న జనసేనాని.. వైసీపీతో పాటు కచ్చితంగా టీడీపీ, బీజేపీని కూడా విమర్శించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయనకు మైలేజీ పెరుగుతుంది. కేవలం వైసీపీని మాత్రమే టార్గెట్ చేసి, టీడీపీ, బీజేపీని వదిలేసి.. తనకు మాత్రమే ఓట్లు వేయాలని అడగటం పూర్తిగా లాజిక్ కి దూరం.

ప్రత్యేక హోదాని మరచిపోయారా..?

2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఉన్న అనేక కారణాల్లో ఒక కారణం ప్రత్యేక హోదా. అప్పట్లో చంద్రబాబు నాలుక మడత పెట్టి హోదా వద్దు ప్యాకేజీ చాలన్నప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్, యువతను టార్గెట్ చేశారు. యువతతో సమావేశాలు పెట్టి ప్రత్యేక హోదా అనే కాంక్షను రగిల్చారు. వైసీపీ ఎంపీలను గెలిపించండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు. అలాగే జరిగింది. కానీ కేంద్రంలో సంకీర్ణం రాలేదు, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడంతో.. జగన్ ప్రత్యేక హోదా తేలేకపోయారు.

అప్పట్లో హోదా కావాలన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే అజెండాని తీసుకుంటే కాస్తో కూస్తో ఉపయోగం ఉంటుందనడంలో సందేహం లేదు. హోదా కోసం గళమెత్తాలంటే ముందు బీజేపీ నుంచి విడిపోవాలి. బీజేపీ నుంచి పవన్ విడిపోతే ఆయనకు చాలా స్పేస్ కలిసొస్తుంది. కేంద్ర విధానాలను వ్యతిరేకించొచ్చు, హోదా కోసం పోరాటం మొదలు పెట్టొచ్చు, ఆ విషయంలో వైసీపీని కూడా ఇరుకున పెట్టొచ్చు. కానీ చేతులారా వైసీపీని, జగన్ ని టార్గెట్ చేసే అవకాశాన్ని వదులుకున్నారు పవన్ కల్యాణ్.

కార్యక్రమాలేవి..?

జనంలోకి వెళ్లాలంటే ప్రతిపక్ష నేతలు ముందుగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలి. సమయానుకూలంగా స్పందించి, ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు మొదలు పెట్టాలి. కానీ పవన్ కల్యాణ్ కేవలం ట్విట్టర్ పోరాటాలు మాత్రమే చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్లో ఓ ప్రెస్ నోట్ పెడతారే కానీ, అదే సమస్యపై జనంలోకి రావాలనుకోరు. కౌలు రైతుల కోసం ఆయన చేపట్టిన యాత్రకి కూడా పెద్దగా స్పందన రావడంలేదు. సింగిల్ అజెండాలు ఈకాలంలో వర్కవుట్ కావు. కానీ పవన్ కౌలు రైతులు అనే సబ్జెక్ట్ నే సాగదీస్తున్నారు.

మిగతా సమస్యలపై ఆయన వైఖరి ఏంటి..? సమస్యలు, వాటి పరిష్కారాలపై స్పష్టత పెంచుకుంటేనే పవన్ మంచి రాజకీయ నాయకుడు అనిపించుకుంటారు, కనీసం అసెంబ్లీకి వెళ్లే అర్హత అయినా సాధిస్తారు. కానీ గందరగోళంలో ఉన్న పవన్, ఎవరితో కలవాలో, ఎవరి నుంచి విడిపోవాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇన్నేళ్లయినా ఇంకా అక్కడే ఆగిపోయారు. తనతోపాటు, తనను నమ్ముకున్నవారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు.