కోర్టుకు కేంద్రం ఏమి చెబుతుందో…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు అసలు తావు లేదని కూడా దూకుడుగా ముందుకు సాగుతోంది. గత…

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ విషయంలో రెండవ మాటకు అసలు తావు లేదని కూడా దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఏడాదిన్నరగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రజా సంఘాలు కలిపి ఉద్యమం చేస్తున్నా కేంద్రానికి చీమ కుట్టినట్లుగా లేదు.

స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో సాగుతోంది. దాంతో ఉత్పత్తికి ఆటంకాలు కల్పిస్తున్నారు అని ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. మరో వైపు ప్లాంట్ లోని కీలక విభాగాలను నిస్తేజం చేయడం, అవసరమైన చోట ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఖాళీలు పెట్టడం వంటివి చేస్తోందని ఆరోపిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏకంగా 22 వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, లక్షలాది మంది పరోక్షంగా ఆధారపడి ఉన్నారని, ఏ పరిశ్రమ స్థాపన కొరకు ప్రజల వద్ద భూములు వేలాదిగా తీసుకున్నారు కానీ ఇప్పటికి అరేడు తరాలు గడచినా కూడా నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేకపోయారంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ హై కోర్టులో కేసు వేశారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఆయన కోరారు.

రాజ్యాంగ విరుద్ధమైన వ్యవహారంగా కూడా ఆయన తరఫున న్యాయవాదులు వాదించారు. ఈ విషయంలో హై కోర్టు స్పందించి కేంద్రానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కూడా ఆదేశించింది.  

తన కౌంటర్ అఫిడవిట్ లో కేంద్రం విశాఖ ఉక్కు విషయంలో ఏమి చెబుతుంది అన్నదే ఇపుడు సర్వత్రా ఆసక్తిని కలిగించే విషయం. సెప్టెంబర్ 21న తదుపరి విచారణ వేళకు కేంద్రం కౌంటర్ తో ఎలా ముందుకు వస్తుందో చూడాల్సి ఉంది.