నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పంచాయతీలోని కొత్త ఎల్లాల గ్రామంలో ఒక బాలిక అదృశ్యమై 9 రోజులైంది. కనీసం మా పాప శవాన్ని అయినా ఇవ్వండయ్యా అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముద్దులొలికే మాటలతో, అమాయక చేష్టలతో తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచే చిన్నారి కనిపించకపోతే ఆ బాధ మాటల్లో చెప్పేది కాదు.
బాలిక అదృశ్యమైతే అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత హోం మినిస్టర్‌కు లేదా? అని ప్రజాసంఘాలు, పౌర సమాజం ప్రశ్నిస్తోంది. స్థానిక ఎంపీ బైరెడ్డి శబరి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. అయితే ఇది మాత్రమే చాలదు. ఎందుకంటే ఆ బాలికను కిడ్నాప్ చేసి, హత్యాచారం చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఘాతుకానికి పాల్పడింది మైనర్లే అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అక్కడికి వెళ్లి వుంటే బాగుండేది. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే హెచ్చరికను పంపినట్టు అయ్యేది. కానీ ప్రభుత్వ పెద్దలెవరూ సంఘటన స్థలానికి వెళ్లకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న చెడ్డపేరు వచ్చింది.
నిందితులంతా హోంశాఖ మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే, వారిని తప్పించాలనే కుట్రలు జరుగుతున్నాయని బాధితులు, వారికి అండగా నిలిచేవారంతా ఆరోపిస్తున్నారు. తక్షణం నిందితుల్ని తెలంగాణలో మాదిరిగా ఎన్‌కౌంటర్ చేయాలని, బాలికను తెచ్చివ్వాలని డిమాండ్ చేస్తుండడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా హోంశాఖ మంత్రి అనిత అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం వుంది.