జనసేన ప్రజాప్రతినిధులకు సత్కార సభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ చైర్మన్ పదవులే కావాలని కోరుకుంటున్నారన్నారు. కేవలం టీటీడీ చైర్మన్ పదవే కావాలని 50 మంది అడిగారని చెబుతూ పవన్‌కల్యాణ్ ఆశ్చర్యపోయారు. అలాగే టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం ఎక్కువ పోటీ వుందన్నారు. తమ కుటుంబ సభ్యులు మాత్రం టీటీడీ చైర్మన్ పదవిని అడగకపోవడం సంతోషకరమన్నారు.
టీటీడీ చైర్మన్‌గా తన అన్న నాగబాబు పేరు తెరపైకి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ పాలనలో కుటుంబ సభ్యులకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఎవరికైనా పదవులు కావాలంటే నిర్మొహమాటంగా తమ అభిప్రాయాల్ని చెప్పాలన్నారు. పదవి అనేది బాధ్యత కావాలన్నారు. అయితే ఇంత మంది చైర్మన్ పదవులు అడుగుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎలా అడగాలో అర్థం కావడం లేదన్నారు.
ఇక తామేం కావాలని బాబు అంటారేమో అని ఆయన సరదాగా కామెంట్ చేశారు. బ్లీచింగ్ పౌడర్‌కు డబ్బు లేదన్నారు. రూ.200 కోట్లు తీసుకురాలేకపోతున్నట్టు ఆయన చెప్పారు. జగన్ సర్కార్ ఏమీ మిగల్చలేదని ఆయన వాపోయారు. అందుకే చంద్రబాబు పరిపాలనా అనుఃభవం అవసరమన్నారు. తనలాంటి వాళ్ల మద్దతు చంద్రబాబుకు ఉండాలన్నారు.