సొంత పార్టీ నాయకులకే జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ షాక్ ఇచ్చారు. తనను బెదిరించే ధోరణిలో మాట్లాడేవారు పార్టీ నుంచి వెళ్లిపోయినా భయపడనని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. జనసేన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.
కూటమి విజయానికి మనం తీసుకున్న నిర్ణయమే కీలకం అని ఆయన అన్నారు. తాను ఉపముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదన్నారు. చాలా గొప్ప విజయం సాధించినట్టు పవన్ తెలిపారు. గత ప్రభుత్వంలో స్వేచ్ఛ వుండేది కాదన్నారు. ఏడు శాతం నుంచి 20 శాతానికి జనసేన ఓటింగ్ పెరిగిందన్నారు. ఒక ఎంపీకి వచ్చినట్టు, ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చిందన్నారు. ఇదంతా జనసేన బలమే అన్నారు.
వైసీపీ నేతలు మనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని పవన్‌కల్యాణ్ ఆదర్శ కామెంట్స్ చేశారు. వాళ్లేమైనా మనల్ని శత్రువులుగా భావించొచ్చు అని అన్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పుల్ని మనం చేయకూడదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తప్పులు చేసి వుంటే, వాటిని చట్టప్రకారం శిక్షించాలని పవన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతల్ని వేధించడం లేదా సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా చేయకూడదన్నారు.
మనం గెలిచామని అధికారుల్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడొద్దన్నారు. కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ కార్యాక్రమాల్లో పాల్గొనకుండా చూడాలన్నారు. బలవంతంగా కుటుంబ సభ్యుల్ని రుద్దకూడదన్నారు. రౌడీయిజాన్ని నమ్మొద్దని సొంత పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. తనను బెదిరించే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించడం గమనార్హం. సొంత పార్టీ నాయకుల్ని సోషల్ మీడియాలో హెచ్చరించే వాళ్లను వదులుకోడానికి సిద్ధమన్నారు. తనకు ఎంత విధేయులైనా వదులుకోడానికి రెడీ అని ఆయన ప్రకటించారు. కావున తనను లోతుగా అధ్యయనం చేయాలన్నారు.
మహిళలను కించపరిచే సొంత పార్టీ నాయకులపై ఎలాంటి బెదురులేకుండా చర్యలు తీసుకోవాలని జనసేన క్రమశిక్షణ సంఘం చైర్మన్ అజయ్‌ని ఆదేశించారు. తాము లేకపోతే పార్టీ ఏమవుతుందో అనే ఆలోచన విడిచిపెట్టాలన్నారు. ఎవరు లేకపోయినా పార్టీ నడుస్తుందన్నారు. తాను తెగించి వచ్చినట్టు సొంత పార్టీ నాయకులకు పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. భవిష్యత్ గురించి ఆలోచించననన్నారు. క్రమశిక్షణా రాహిత్యంతో తలపోటు తీసుకురావద్దన్నారు.
అవరసరైతే తన కుటుంబ సభ్యుల్ని కూడా పక్కన పెట్టేస్తానని అన్నారు. తాము లేకపోతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన గెలవలేదని అనుకునే వాళ్లు దయచేసి వెళ్లిపోవచ్చన్నారు. ఓడిపోతే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. రాజీ పడే ప్రశ్నే లేదన్నారు. తాను ఈ హెచ్చరికలు ఎందుకు చేస్తున్నానో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.