తెలంగాణలో నిరుద్యోగులు అప్పుడే రోడ్డెక్కారు. నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడం, బీసీ జనసభ కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉద్రిక్తత నెలకుంది. సచివాలయంలోకి వారంతా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరుద్యోగుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలని వారు కోరారు. వాయిదా వేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించడం గమనార్హం. ప్రధానంగా తెలంగాణ నిరుద్యోగులు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు… ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలి. అలాగే గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, గ్రూప్-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో సోమవారం సచివాలయాన్ని ముట్టడించడం గమనార్హం.
సచివాలయం వద్ద పోలీసులును భారీగా మోహరించారు. బాహుబలి బారికేడ్లు, ఇనుపకంచెలు, వాటర్ కేన్లను ఏర్పాటు చేశారు. సచివాలయం వద్ద నిరుద్యోగులతో యుద్ధవాతావరణం నెలకుంది. నిరుద్యోగుల నిరసనలు రేవంత్‌రెడ్డి సర్కార్‌కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తున్నది మరొకటి అన్న చందంగా పాలన ఉందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.