అదే జరిగితే, ‘కమ్మ’ మంత్రి ఎవరు?

ఎన్నికల నాటికి కులాల సమతూకం పక్కాగా ఉండే కేబినెట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిలషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత.. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే వార్తలు కొన్ని రోజులుగా ప్రచారంలో…

ఎన్నికల నాటికి కులాల సమతూకం పక్కాగా ఉండే కేబినెట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిలషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత.. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే వార్తలు కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటిదాకా విస్మృతికి గురవుతున్న కొన్ని కులాలకు జగన్ ఈ ఎమ్మెల్సీల జాబితాలో చోటు కల్పించారు. వారిలో కొందరికి మంత్రిపదవులు కూడా దక్కుతాయని తెలుస్తోంది. కనీసం నలుగురిన పక్కకు తప్పించి.. నలుగురు కొత్త ఎమ్మెల్సీలకు కేబినెట్ లో చోటు ఇస్తారనేది అందరి అంచనా. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఒక మంత్రి వస్తారనే ప్రచారం ఉంది. 

రాష్ట్రంలో పార్టీల మధ్య ప్రజలు కులాల వారీగా పోలరైజ్ అయి ఉన్న మాట వాస్తవం. వైఎస్సార్ కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని, తెలుగుదేశం అంటే కమ్మవారి పార్టీ అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇది నూరుశాతం ఇలాగే ఉంటుందని అనుకోలేం. ఎందుకంటే.. రెండు పార్టీల్లోనూ మిగిలిన కులాల వారు కూడా గణనీయంగానే ఉంటారు. 

అయితే.. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంబించాక తొలి కేబినెట్లో కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నాని ప్రాతినిధ్యం వహించారు. కేబినెట్ ను విస్తరించినప్పుడు.. కమ్మ వారికి అందులో చోటు లేకుండాపోయింది. దీంతో తెలుగుదేశం దళాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ ను కమ్మవారిని ద్వేషించే పార్టీగా ప్రచారం చేయడానికి అవకాశం ఏర్పడింది. తెలుగుదేశం అలాంటి గోబెల్స్ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తోంది కూడా. 

ఈ నేపథ్యంలోనే బీసీ, వెనుకబడిన కులాలకు ఇచ్చినట్టుగానే కమ్మ వర్గానికి కూడా ఒక మంత్రి పదవి బెర్త్ కట్టబెట్టే యోచనలో సీఎం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వర్గంనుంచి పదవి దక్కించుకునేది ఎవరనే క్లారిటీ రావడం లేదు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల ప్రచార సమయంలోనే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని అప్పట్లోనే మాట ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా అది జరగలేదు. ఇప్పుడు మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారు. తన మాట నిలబెట్టుకోవడం కోసం ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా మంత్రిపదవి ఆశిస్తున్నారు. అసలే తన నియోజకవర్గంలో మంత్రి జోగిరమేష్ తో పొసగక ఉక్కిరి బిక్కిరి అవుతున్న వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల జగన్ ను కలిశాక మళ్లీ కాస్త యాక్టివ్ అయ్యరు. ఆయనకు జగన్ మంత్రి పదవి హామీ ఇచ్చారని, కమ్మకోటాలో భర్తీ చేస్తారని కూడా వినిపిస్తోంది. 

కొడాలినానికి మళ్లీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఎటూ లేదు. ఇకపోతే వసంత కృష్ణప్రసాద్, మర్రిరాజశేఖర్ ఇద్దరూ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.