జనసేనాని పవన్‌కల్యాణ్ వెండితెరపై పెద్ద హీరోనే. కానీ రాజకీయ తెరపై మాత్రం ఆయన కమెడియన్ పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యాలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్నారు. పార్టీ నడపటానికి అర్హత వైసీపీకే ఉందా? మాకు లేదా? అని ఆయన ప్రశ్నించడం గమనార్హం. 2009లో అనుకోలేదు కాబట్టి పవన్‌కల్యాణ్ ఎంపీ కాలేదని అనుకున్నాం. 2019లో ఎమ్మెల్యే కావాలనే ఆశయంతోనే కదా భీమవరం, గాజువాకలో పవన్‌కల్యాణ్ పోటీ చేసిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరెందుకు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.
అదేంటోగానీ, ప్రతి విషయానికి గతానికి వెళ్లడం పవన్‌కు ప్యాషన్ అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోనీ రాజకీయాల్లో గతం ఏమైనా అద్భుతంగా ఉందా? అంటే అదేం లేదనే సమాధానం వస్తుంది. 2009లో పవన్‌కల్యాణ్ అన్న, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ పార్టీ యువరాజ్యం విభాగానికి పవన్ సారథ్యం వహించారు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. చిరంజీవి మాత్రం తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నేను అప్పుడు అనుకుంటే అలా అయ్యేవాడనని పవన్ చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడైనా ఆయన అద్భుత ఫలితాలు సాధించి వుంటే, పవన్ మాటలకు విలువ వుండేదని అంటున్నారు. అయినా జరిగి పోయిన కాలానికి సంబంధించి ఎందుకు గుర్తు చేస్తున్నారో పవన్‌కైనా అర్థమవుతోందా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కులాల ప్రస్తావన తెస్తున్నారని పవన్‌కల్యాణ్ మరో జోక్ చేశారు.
పదేపదే తన సామాజిక వర్గంలోని ఉపకులాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చేదే ఆయన. ఇక నీతులు మాత్రం ఇతరులకు చెప్పడం పవన్‌కే చెల్లిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువత ఉపాధిపై ప్రశ్నిస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుష్టచతుష్టయంతో పవన్ చేతులు కలిపారని జగన్ విమర్శించడం తప్ప, ఆయన కుల ప్రస్తావన తెచ్చిన సందర్భమే లేదు. కానీ కులం గురించి మాట్లాడ్డం ద్వారా తన సామాజిక వర్గాన్ని జనసేన వైపు మళ్లించే ఎత్తుగడ ఉందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.