ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరని పెద్దలు చెబుతుంటారు. అదేంటోగానీ, ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకున్నాయి. పాలకప్రతిపక్ష పార్టీ నేతలు పరస్పరం శత్రువుల్లా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుంటారు.
రాజకీయాలకు అతీతంగా నేతలు పాల్గొనడం అంటే… అదో ఎనిమిదో వింతగా చెప్పుకోవచ్చు. ఇవాళ అలాంటి వింతను చూడడానికి ఆంధ్రప్రదేశ్ సమాజం ఆసక్తితో ఎదురు చూస్తోంది.
ఇవాళ 76వ స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్‌లో సాయంత్రం ఐదు గంటలకు తేనేటి విందు (At Home) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ తదితరులకు ఆహ్వానం అందినట్టు సమాచారం. సీఎం జగన్, చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్ కూడా హాజరవుతారనే చర్చకు తెరలేచింది.
జగన్, చంద్రబాబు పలు సందర్భాల్లో కలుసుకున్నారు. కానీ పవన్‌కల్యాణ్, జగన్ ఇంత వరకూ ముఖాముఖి కలుసుకున్న సందర్భం లేదు. రాజకీయంగా ఇద్దరూ కత్తులు దూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి కలయికపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.
ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించినా పవన్‌కల్యాణ్ వెళ్లలేదు. ఆ సభలో జగన్‌తో పాటు పాల్గొనడం ఇష్టలేకే పవన్ వెళ్లలేదని జనసేన నేతలు ప్రచారం చేశారు.
గతంలో గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఉల్లాసంగా పాల్గొనేవారు. పక్కపక్కనే కూచుని నవ్వుతూ కబుర్లు చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు అలాంటి సీన్ చూసే భాగ్యం మనకు కరువైంది. ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించడం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో ఎట్ హోం కార్యక్రమంలో ముగ్గురు నేతలు కలిస్తే. ఎలా వుంటుందనే చర్చ నడుస్తోంది. తినబోతు రుచి చూడడం దేనికి? కాసేపట్లో ఎట్ హోం కార్యక్రమాన్ని లైవ్‌లో చూసే అవకాశం కలగనుంది. ఎవరెవరు వస్తారో, ఎలా మెలుగుతారో చూద్దాం.