ఏపీలోని ప్రభుత్వం సమర్థుడిగా, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలిగిన వాడిగా నమ్మిన ఒక వ్యక్తి.. మౌలికమైన ఆలోచనల్లోనే లోపం ఉన్నదని తెలిసినప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేయాలి? ఒకరికి నిర్దిష్టమైన అధికార బాధ్యతలను కూడా అప్పగించిన తర్వాత.. ఆ వ్యక్తి దేశానికే మచ్చ తెచ్చే వ్యాఖ్యలను చేసినప్పుడు.. ఎలా స్పందించాలి? ఈ మీమాంస గతంలో ఎవరెవరికి ఏయే సందర్భాల్లో ఎదురైనదో మనకు తెలియదు గానీ.. మహాత్మాగాంధీ గురించి ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం ఘోరంగా ఉంది.
ఏమాత్రం సమర్థనీయంగా లేదు. ఎస్సీ వర్గం నుంచి విక్టర్ ప్రసాద్ మహాత్మా గాంధీ గురించి నోటికి వచ్చినట్టల్లా పేలిన నేపథ్యంలో.. అదే ఎస్సీ వర్గానికి చెందిన మరో నాయకుడితో ఆ వ్యాఖ్యలను ఖండించేస్తే సరిపోతుంది అని ముఖ్యమంత్రి జగన్ భావించినట్లుగా కనిపిస్తోంది. ‘‘మహాత్మా గాంధీ దుర్మార్గుడు, నీచుడు’’ అని విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలు చేస్తే మంత్రి మేరుగు నాగార్జున ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలతో తమ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ.. ఏమాత్రం సంబంధం లేదని మంత్రి మేరుగు చెప్పేశారు.
మంత్రి మేరుగు ప్రెస్ మీట్ మొత్తం అపభ్రంశంగా తయారైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి.. అలా జాతీయ నాయకుల గురించి మాట్లాడడం సరికాదని ఒక మాట చెప్పి అంతటితో దులుపుకున్నారు. మహాత్ముడి గురించి ఇలాంటి నేలబారు మాటలు మాట్లాడే వ్యక్తిని తీసుకువచ్చి అలాంటి గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చోబెట్టిన పాపం ఎవరిది? ఈ ప్రభుత్వానిదే కదా? మరి తాము పదవిలో కూర్చోబెట్టిన వ్యక్తి ఇలా దారి తప్పి మాట్లాడుతోంటే.. ఆ పదవినుంచి తొలగించి.. బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఇదే ప్రభుత్వానికి లేదా? ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అంటే సరిపోతుందా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవహారాల్లాగా దీనిని కూడా తానుగా స్పందించకుండా.. అదే సద్దుమణిగిపోతుందిలెమ్మని ఊరుకుంటే కుదర్దు. విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలు కొన్ని కులాలను ఉద్దేశించి ఉన్నాయని.. ఆ కులాలవారు బాధపడతారేమో అన్నట్టుగా, వారిని దువ్వుతున్నట్టుగా మేరుగు నాగార్జున ప్రెస్ మీట్ జరిగింది. మహాత్మా గాంధీని ఒక కులానికి ప్రతినిధిగా చూడడం అనే దరిద్రం మన దగ్గరే ఉంది. గాంధీ ఒక కులానికి ప్రతీక అనడమే మహా పాపం. అలాంటిది విక్టర్ ప్రసాద్.. మహాత్ముడి గురించి అవాకులు చెవాకులు పేలారు. ఎలాంటి చారిత్రక ఆధారాలు లేకుండా.. తనకు చిత్తమొచ్చినట్లుగా దూషణలు చేశారు.
గాంధీ స్త్రీలకు వ్యతిరేకి అన్నట్టుగా ఇచ్చమొచ్చిన రీతిలో ఆరోపణలు చేసేశారు. ఈ దేశం గర్వించే.. యావత్ ప్రపంచం కూడా మహాత్ముడిగా పరిగణించే ఒక జాతీయ నేత గురించి.. తమ పార్టీ నాయకుడు.. తాను కూర్చోబెడితే, రాజ్యాంగబద్ధ అధికారపదవిని అనుభవిస్తున్న వాడు.. ఎడాపెడా వాగితే.. ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు. మహాత్ముడి ఆదర్శాలు, కులాల పట్ల ఆయన దృక్పథం, మహిళల పట్ల ఆయన అభిప్రాయాలు.. ఇవేవీ ముఖ్యమంత్రి జగన్ కు తెలియవా? లేదా, గాంధీ జీవన విలువల పట్ల ఆయనకు విశ్వాసం లేదా?
గాంధీ మీద వేసే నిందలు.. ఒక కులం మీద వేసే నిందలు కాదు! మహాత్ముడిని ఈ దేశంలో అత్యుత్తమ జీవన విలువలకు ప్రతీకగా భావించే, స్వాతంత్ర్యపోరాటాన్ని.. చివరి దశలో ఒక క్రమపద్ధతైన మార్గంలోకి తీసుకువెళ్లిన మహనీయుడిగా భావించే కోట్లాది మంది మనోభిప్రాయాలను అవమానించేవి. ముఖ్యమంత్రి జగన్ నిష్క్రియాపరత్వాన్ని, మహాత్ముడి పట్ల ఆయన చేస్తున్న అవమానంగా వారందరూ కూడా భావిస్తారు. విక్టర్ ప్రసాద్ ను ప్రభుత్వ పదవినుంచి తక్షణం తొలగించకుండా.. జగన్ ప్రభుత్వం.. ఆయనను ఆ పదవిలో నియమించడం ద్వారా చేసిన పాపాన్ని కడిగేసుకోవడం సాధ్యం కాదు!