ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హర్షించాల్సిన నిర్ణయం ఇది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించారు. తద్వారా రాష్ట్రంలో పర్యావరణ హితం దిశగా కొత్త అడుగులు వేశారు. లెక్కకు మిక్కిలిగా తయారవుతున్న ఫ్లెక్సీ పోస్టర్లు ఇక కనిపించవు. వాటి ద్వారా జరిగే పర్యావరణ హాని కూడా ఉండదు.
అయితే తాను రాజకీయాలలో ఉన్నాడు గనుక, ఏదో ఒకటి మాట్లాడాలి.. అని ఉబలాటంతో ఊరేగుతూ ఉండే నారా లోకేష్ ఈ విషయంలో కూడా నోరు చేసుకుంటున్నారు! అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ తన అమాయకత్వాన్ని లేదా మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు.
తాజాగా లోకేష్ మార్కు కామెడీ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి జగన్ కు ఒక లేఖ రాశారు. దాని ప్రకారం ఫ్లెక్సీలు నిషేధం హఠాత్తుగా ఎందుకు చేశారు అనేది ఆయన ప్రశ్న! ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు దొరికేవరకు ఇలా చేసి ఉండాల్సింది కాదు.. అని ఆయన సూచన! వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రభుత్వమే సాయం అందించాలనేది ఆయన సలహా! ఇలా రకరకాలుగా రెచ్చిపోయారు. అసలు పర్యావరణం మీద ముఖ్యమంత్రికి హఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అని ఒక చవకబారు సందేహం కూడా వెలిబుచ్చారు.
ఇక్కడ కొన్ని విషయాలను ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? అని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు. ఫ్లెక్సీ పోస్టర్లు అనేవి పర్యావరణానికి హాని చేస్తున్నాయి అనేది ఎప్పటినుంచో ఉన్న విషయమే! అయితే అది హద్దు మీరుతోందని అనిపించిన ఏదో ఒక క్షణంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఐదేళ్లు పాలన సాగించిన తన తండ్రికి రాని పర్యావరణ హితకారక ఆలోచన జగన్ మోహన్ రెడ్డికి వచ్చేసరికి చినబాబు ఓర్వలేకపోతున్నట్టుంది అందుకే ఇలాంటి మాటలు అంటున్నారు.
ఈ నిర్ణయాన్ని ఏడాది పాటు వాయిదా వేయాలన్నది ఇంకో తమాషా సూచన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ నిషేధం నిర్ణయాన్ని కొన్ని నెలల కిందటే ప్రకటించారు. అలాగే ఈ నిర్ణయం నవంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రాబోతోంది. మరి అలాంటప్పుడు.. ఈ నెలల వ్యవధిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఫ్లెక్సీ యూనిట్ యజమానులకు సమయం సరిపోదా? వారికి ఇబ్బంది కలగకుండా ఉండడానికే కదా ఈ గ్యాప్ ఇచ్చారు.. అనేది ప్రజల సందేహం.
ప్రత్యామ్నాయంగా క్లాత్ ప్రింటింగ్ యూనిట్లు కూడా ఏర్పడతాయి. ఇవి అన్నీ పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. పెద్ద సంఖ్యలో అవసరమైన వారు మాత్రమే క్లాత్ ప్రింటింగ్ ద్వారా చేయించుకుంటారు. అదే సమయంలో చిన్నచిన్న అవసరాలకు ప్రతి ఒక్కరూ చేత్తో బ్యానర్లు రాసే ఆర్టిస్టుల మీద ఆధారపడతారు. తద్వారా కొన్ని వేల మంది ఆర్టిస్టులు ఉపాధి పొందే అవకాశం ఉంది. ఫ్లెక్సీ యూనిట్లు వచ్చిన తర్వాత కూలీ పనికి పరిమితమైన కళాకారులు.. తిరిగి ఇప్పుడు తమ కుంచెకు పని చెప్పే అవకాశం ఉంది.. అలా కళాకారులను ప్రోత్సహించే నిర్ణయం ఇది.
నిర్ణయం లోని అన్ని పార్శ్వాలను గమనించి మాట్లాడితే నారా లోకేష్ విజ్ఞత గల రాజకీయ నాయకుడు అనిపించుకుంటాడు. ఏమీ లేకుండా అర్థం పర్థం లేని విమర్శలు మొక్కుబడి కామెంట్లతో జనం ముందుకు వస్తే అందరూ నవ్విపోతారు.