తాను స్థాపించబోయే జాతీయ పార్టీ ద్వారా రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలి.. కాంగ్రెస్ కూడా లేని కూటమికి ప్రాణం పోయాలంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి.. అనే విషయంలో కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చారో లేదో ఇంకా తెలియదు! అయితే ఒక జాతీయ పార్టీ నాయకుడిగా తనకు తాను హైప్ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఇన్నోవేటివ్ ఆలోచనలు చేస్తున్నారు.
జాతీయ పార్టీ అనగానే దేశం మొత్తం తిరగాల్సిన అవసరం ఉంటుంది గనుక.. తమ పార్టీకి ఒక విమానం ఉండాలి.. అని కొత్తగా డిసైడ్ అయ్యారు. అక్టోబర్ 5వ తేదీ దసరా పర్వదినం నాడు ఒక చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలుకు ఆర్డర్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి!
కెసిఆర్ ఇప్పటికే జాతీయ స్థాయిలో తన ముద్ర చూపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. విమానం అద్దెకు తీసుకుని ఊరూరూ తిరిగారు. అయితే ఏం సాధించారు? అనేది మాత్రం నిర్దిష్టంగా చెప్పలేం! ఎందుకంటే అనేక రాష్ట్రాలు తిరిగి, అనేకమంది నాయకులతో సమావేశమై, విందులు ఆరగించి ప్రెస్ మీట్ లు పెట్టి మోడీని దించడానికి కలిసి పనిచేయబోతున్నాం అని ప్రకటించారు కేసీఆర్. కలిసి పనిచేయడం అంటే వారి రాష్ట్రాల్లో తన పార్టీని పోటీ చేయించడం కాదు కదా.
ఆయా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలకు మద్దతుగా కెసిఆర్ ఉంటారని తొలుత అందరూ అనుకున్నారు. ఏమైందో ఏమో గాని తర్వాత తానే జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయానికి వచ్చారు గులాబీ దళపతి, అప్పటినుంచి ఇతర పార్టీలతో మాటలు తగ్గాయి. తన జాతీయ పార్టీ ఏరకంగా మనుగడ సాగిస్తుందో ఆయనకు ఒక ఆలోచన ఉండవచ్చు. కానీ ఎవరూ చేయని విధంగా తమ పార్టీ కోసం ఒక సొంత విమానాన్ని కొనడం ద్వారా,, దేశంలోని చిన్నా చితకా అన్ని పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నారు కేసీఆర్.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. తెరాస పార్టీ వద్ద ప్రస్తుతం ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల నిధులు మూలుగుతున్నాయట! కానీ 80 కోట్లు పెట్టి కొత్తగా విమానం కొనడానికి ఆయన చందాలు పోగు చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. సుమారు 60 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని యాదగిరి నరసింహునికి కానుకగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధపడుతున్న రోజునే.. 80 కోట్ల రూపాయల కానుకను తాను స్వీకరించడం కోసం చందాలకు తెరలేపే నిర్ణయం బయటకు రావడం యాదృచ్ఛికం!
జాతీయ రాజకీయాలలో తన ముద్ర చూపించుకోవడానికి గులాబీ దళపతి చేస్తున్న హంగు ఆర్భాటాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ వర్కవుట్ అవుతాయా? ఒక అత్యద్భుతమైన మోడల్ జనరేషన్ కంప్యూటర్ను కొనుగోలు చేసినంత మాత్రాన.. అద్భుతమైన సాఫ్ట్వేర్ రూపొందుతుందా? లక్ష రూపాయలు విలువచేసే పెన్ తో రాసినంత మాత్రాన.. అద్భుతమైన రచన తయారవుతుందా? అనేది సామాన్యులకు కలిగే ప్రశ్న!!
హంగు ఆర్భాటాలు అనేవి నాలుగు రోజులపాటు ఆయన గురించి అందరూ మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయేమోగానీ.. ఆయనకు ప్రజాబలం పెంచడానికి ఉపకరించవు! ఆ సత్యం కొన్ని లక్షల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు తెలియనిది కాదు!!