అధికారంలోకి వచ్చిన వారంలోపే ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేస్తామని, పాత పెన్షన్ స్కీంను అమలు చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పదేపదే చెప్పారు. ఇప్పుడు అదే ఆయన ప్రభుత్వ మెడకు చుట్టుకుంది. హామీని నిలబెట్టుకోవాలని సీపీఎస్ ఉద్యోగులు ఒత్తిడి, మరోవైపు దాని వల్ల భరించలేని ఆర్థిక భార భయం వెంటాడుతోంది. దీంతో మధ్యే మార్గంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకు సీపీఎస్ ఉద్యోగులు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు.
సీపీఎస్ మినహా, ఇతర స్కీంలపై చర్చిస్తామంటూ తాము సచివాలయానికి రాలేమని కొన్ని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. మరోవైపు సీపీఎస్‌పై తొందరపడి హామీ ఇచ్చామని సీఎం జగన్, మంత్రులు ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్‌పై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరోసారి స్పందించారు.
రెండు నెలల్లో సీపీఎస్ అంశాన్ని తేల్చేస్తామన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సీపీఎస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా వుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తమ పార్టీ ఇచ్చిన 100 హామీల్లో సీపీఎస్ రద్దు కూడా ఉందన్నారు. ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
సీపీఎస్ రద్దు చేసి గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాని నుంచి బయటపడడం ఎలా అనేది ప్రభుత్వానికి పెద్ద ప్రశ్నగా మారింది. ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అనే చందంగా జగన్ ప్రభుత్వ పరిస్థితి తయారైంది.