ఏపీలో ఎక్కడ నిలిచినా కనీసం పది ఓట్లు కూడా సీపీఐకి రావు. కానీ తాము చెప్పినట్టు ప్రభుత్వం, అధికార పక్షం నడుచుకోవాలని సీపీఐ నాయకులు కోరుకుంటూ వుంటారు. ఏపీలో చంద్రబాబు జేబు పార్టీగా సీపీఐ విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముందు వరుసలో వుంటారు.
టీడీపీ మాట్లాడలేని అంశాల్ని ఈయనతో పలకిస్తూ వుంటారు. అదే ప్రత్యేకం మరి. మూడు రాజధానుల బిల్లు మళ్లీ అసెంబ్లీలో ప్రవేశ పెడతామని మంత్రులు, ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నారు. అయితే రాజధాని ఎంపిక అధికారం అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వ అడుగులు చర్చకు దారి తీస్తున్నాయి. ఏపీలో అసలు రాజ్యాంగం అమల్లో వుందా? అని ప్రశ్నించే వరకూ సీపీఐ నాయకుడు రామకృష్ణ వెళ్లారు.
గతంలో ఇట్లే ఒకాయన ఏపీలో రాజ్యాంగం అమలవుతున్నదా? లేదా? అని తేలుస్తానని పెద్దపెద్ద మాటలు చెప్పారు. ఇటీవల ఆయన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. సీపీఐ నేత రామకృష్ణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హైకోర్టు తీర్పుతో అమరావతి అంశం ముగిసిపోయిన అధ్యాయమని అనుకున్నట్టు చెప్పారు.
కానీ మూడు రాజధానుల అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అసలు రాజ్యాంగం అమల్లో ఉందా? అని రామకృష్ణ ప్రశ్నించారు. రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా..మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ అభివృద్ధికి కారణమైన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతుల పేరుతో పచ్చ బ్యాచ్ ఏం చేసినా నోరు మూసుకుని వుండాలనేది రామకృష్ణ మాటల సారాంశం.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ఆకాంక్షల గురించి ఎవరూ ఏమీ మాట్లాడకూదని రామకృష్ణ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇదే సీపీఐ రాయలసీమకు హైకోర్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు అనేక సందర్భాల్లో చెప్పింది. ఆచరణకు వచ్చే సరికి ఎందుకు మోకాలు అడ్డుపెడుతున్నదో రామకృష్ణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు పని చేస్తుంటారు. ఇదేమీ విచిత్రమో కానీ పెట్టుబడుదారుల కోసమే అమరావతి ఉద్యమానికి సీపీఐ మద్దతు ఇస్తోందన్న విమర్శ ఎదుర్కొంటోంది.