వచ్చే ఏడాది జనవరి 27న కుప్పం నుంచి నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. లోకేశ్‌కు, టీడీపీకి ఈ పాదయాత్ర ఎంతో ప్రతిష్టాత్మకం. లోకేశ్ నడక ఆయన నడతలో మార్పు తీసుకొస్తుందా? ఇప్పుడిదే ప్రధాన చర్చనీయాంశమైంది. లోకేశ్‌కు ముందు, ఆ తర్వాత అని టీడీపీ గురించి మాట్లాడుకోవాల్సి వుంటుంది. లోకేశ్‌ను దగ్గరగా చూసిన వాళ్లు, సన్నిహితులు ఆయన తెలివితేటల గురించి గొప్పగా చెబుతుంటారు.
కానీ ఆచరణకు వస్తే… లోకేశ్ ముద్ర టీడీపీపై పాజిటివ్ కోణంలో ఎక్కడా కనిపించడం లేదు. పైగా లోకేశ్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటి నుంచి చంద్రబాబు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురి కావాల్సి వస్తోందనే ఆవేదన సీనియర్ నేతల నుంచి వ్యక్తమవుతోంది. టీడీపీలో లోకేశ్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఆ పార్టీకి భారమే తప్ప, లాభం లేదనే వాళ్లే ఎక్కువ. చివరికి మొట్టమొదట ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటే … అక్కడ ఓటమిని మూటకట్టుకున్నారనే మాట బలంగా వినిపిస్తోంది.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా వైఎస్సార్ ప్రజాప్రస్థానం పేరుతో చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. అదేంటో గానీ, చంద్రబాబు పాదయాత్ర చేసినట్టు సొంత పార్టీ, ఎల్లో మీడియా చెబితే తప్ప ఎవరికీ గుర్తుండని పరిస్థితి. పాదయాత్ర తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి వుండొచ్చు. కానీ అది వేరే సంగతి.
ఆ తర్వాత జగన్ సుదీర్ఘ పాదయాత్ర జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. జగన్ సుదీర్ఘ పాదయాత్ర ఆయన్ను ప్రజానీకానికి, అధికారానికి చేరువ చేసింది. జగన్ పాదయాత్రలో సునామీలో జనం పోటెత్తారు. ఔనన్నా కాదన్నా జగన్‌ను కాదని ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకోలేని పరిస్థితిని సృష్టించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
తాజాగా లోకేశ్ పాదయాత్ర సంకల్పం వెనుక పరోక్షంగా జగనే స్ఫూర్తి అని చెప్పక తప్పదు. ఈ విషయాన్ని టీడీపీ అంగీకరించకపోవచ్చు. లోకేశ్ పాదయాత్ర మొదలుకుని, ప్రతిదీ జగన్ నడకతో జనం పోల్చి మంచీచెడుల గురించి మాట్లాడుకుంటారు. అందుకే లోకేశ్‌కు ఈ నడక ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పడం. పాదయాత్రలో జగన్ జనంతో మమేకం అయిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది.
జగన్‌లా లోకేశ్ ప్రజలను ఆకట్టుకుంటారా? ఇప్పుడిదే ప్రధాన చర్చ. లోకేశ్ బాడీ లాంగ్వేజీ, మాట తీరు చూస్తే… జనాన్ని మెప్పించడం పెద్ద టాస్కే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లోకేశ్ మాటతీరు ఇటీవల కాలంలో చాలా చిల్లరగా వుంటోంది. సీనియర్ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంటి వాళ్లను పట్టుకుని వాడు, వీడు అని నోరు పారేసుకున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు అలా దూషణలకు దిగితే అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అనధికార సారథి అయిన లోకేశ్ స్థాయి, విచక్షణ మరిచి నేలబారు భాష మాట్లాడ్డం ఆయనకే నష్టం.
అసలే లోకేశ్ అంటే వైసీపీ నేతలకు చులకన భావం. పప్పు, ఉప్పు అంటూ వెటకారం చేస్తుంటారు. అలాంటి వాళ్లకు మరింతగా అవకాశం ఇస్తూ లోకేశ్ ప్రవర్తన వుంటోందన్న విమర్శ లేకపోలేదు. అందుకే లోకేశ్ నడక ఆయన నడతను మార్చేలా వుండాలని చెప్పడం. లోకేశ్‌ను భావి నాయకుడిగా ప్రజలు భావించేలా నడుచుకుంటే ఆయన విజయం సాధించినట్టే. మొత్తానికి లోకేశ్ నడక ఆయన భవిష్యత్‌ను తేల్చేదని చెప్పక తప్పదు. అది పాజిటివ్ అయితే చంద్రబాబుకు సంతోషం. లేదంటే వేదన మిగిల్చిన తనయుడిగా లోకేశ్ చరిత్రలో నిలిచిపోతారు.