ప్రధాని మోదీని జనసేనాని పవన్‌కల్యాణ్ కలవడాన్ని వామపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. బీజేపీతో జనసేన పొత్తులో వున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీతో కలిసి పవన్‌కల్యాణ్ ఎలాంటి కార్యక్రమాలు చేయని సంగతి తెలిసిందే. పైగా టీడీపీతో స్నేహహస్తం కోసం పవన్ తహతహలాడడం వామపక్ష పార్టీలకు ఆనందం కలిగిస్తోంది.
ఇటీవల ఇప్పటంలో పర్యటించిన జనసేనాని పవన్‌కల్యాణ్ వెంట సీపీఎం ముఖ్య నాయకుడు మధు నడవడం తెలిసిందే. పవన్‌ను తమ వాడిగా సీపీఐ నాయకులు కూడా భావిస్తున్నారు. గతంలో తమతో పొత్తు విడగొట్టుకున్న సందర్భంలో పవన్‌పై సీపీఐ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సరిగ్గా ఐదు నిమిషాలు స్థిరంగా నిలబడి పవన్ మాట్లాడితే పొత్తు పెట్టుకోవాలని రామకృష్ణకు సూచించినట్టు ఆ పార్టీ జాతీయ నాయకుడు కె.నారాయణ వెటకారం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మరోసారి పవన్‌పై వామపక్ష పార్టీలు ఆశలు పెంచుకుంటున్నాయి. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మోదీతో పవన్ భేటీ కావడాన్ని తప్పు పట్టారు.
మోదీని రోడ్ మ్యాప్ అడగడం ఏంటని ఆయన పవన్‌ను నిలదీశారు. తమతో కలిసి ఉద్యమించడానికి పవన్‌కల్యాణ్ రావాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. మోదీ, జగన్ ఇద్దరూ ఒకటేనని రామకృష్ణ అన్నారు. ఈ విషయాన్ని పవన్ తెలుసుకోవాలని సూచించారు. భేటీగా భాగంగా విశాఖ ఉక్కుపై మోదీని గట్టిగా నిలదీయాలని రామకృష్ణ కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించకపోవడం సరైందని కాదని సన్నాయి నొక్కులు నొక్కడం విశేషం.
తమతో పాటు బాబును ఉద్యమంలోకి రావాలని రామకృష్ణ డిమాండ్ చేయకపోవడాన్ని గమనించొచ్చు. మోదీతో గొడవ పెట్టుకుంటే ఎక్కడ టీడీపీకి ఇబ్బందులు ఎదురవుతాయో అనే భయంతో రామకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించింది.