సాధారణ ఎన్నికలు కావొచ్చు, ఉప ఎన్నికలు కావొచ్చు రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవడం మామూలే. ఈ సహకారానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఉమ్మడి శత్రువు అంటే కామన్ ఎనిమీ. మునుగోడుకు ఉప ఎన్నిక జరుగుతుందనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా ఉందనుకోండి. అది వేరే విషయం.
దక్షిణ తెలంగాణలో గులాబీ పార్టీకి అంతగా బలం లేదు. వాటిల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ కు, వామపక్షాలకు బలం ఉంది. ప్రధానంగా లెఫ్ట్ పార్టీలకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడంటే ఎర్ర పార్టీలు చతికిల పడ్డాయి. కానీ ఈ పార్టీలు వైభవంగా బతికిన కాలం ఉంది.
అందుకే ఏ పార్టీ అయినా వామపక్షాలను తేలిగ్గా తీసిపారేయలేవు. కేసీఆర్ ది కూడా ఇదే అభిప్రాయం. వాస్తవం చెప్పాలంటే మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ కు కూడా భయం కలిగిస్తోంది. ఒకప్పుడు దుబ్బాకలో, ఆ తరవాత హుజురాబాద్ లో, మధ్యలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ మ్యాజిక్ పనిచేయలేదు. హుజూరాబాద్ లో ఎంతో కష్టపడినా ఫలితం వ్యతిరేకంగా వచ్చింది.
అందుకే మునుగోడుకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మునుగోడులో వామపక్షాల సహకారం తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. నిజానికి ఈ పార్టీలు కేసీఆర్ కు అనుకూలం కాదు. కానీ టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి శత్రువులు.
ఆ రెండింటిని ఓడించాలంటే టీఆర్ఎస్ కు బలం చాలకపోవొచ్చు. లెఫ్ట్ పార్టీలకు ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడించే బలం అసలే లేదు. అందుకే కేసీఆర్ లెఫ్ట్ పార్టీల సహకారం కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు సహకరించాయి. అందుకే అక్కడ బలమైన కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి ఓడిపోయారు.
మునుగోడులో కేసీఆర్ వామపక్షాల సహకారం కోరుకోవడానికి కారణం అక్కడ ఆ రెండు పార్టీలకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండటమే. 2009 లో ఇక్కడ సీపీఐ అభ్యర్థి యాదగిరి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని ఓడించారు. మునుగోడులో సహకారం కోసం లెఫ్ట్ పార్టీలతో మాట్లాడాలని కేసీఆర్ పార్టీ నాయకులను ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ కూడా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ను టాక్స్ కోసం ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి శత్రువైన బీజేపీని ఓడించడానికి లెఫ్ట్ పార్టీలు తప్పక సహకరిస్తాయని టీఆర్ఎస్ నాయకులు భరోసాగా ఉన్నారు. మునుగోడులో 2009 లో సీపీఐ గెలవగా, 2018 లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు.
అప్పుడు సీపీఐ ఆయన విజయానికి సహకరించింది. 2014 ఎన్నికల్లో దేవరకొండలో సీపీఐ టీఆర్ఎస్ ను ఓడించింది. 2018 ఎన్నికల్లో ఎర్ర పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ గులాబీ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 2019 లో హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ వామపక్షాలు టీఆర్ఎస్ కు సహకరించాయి. ఇప్పుడు మునుగోడులోనూ సపోర్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.