ఎటు చూసినా జనమే. ఒక వైపు సాగర ఘోష. మరో వైపు దానికి పోటీగా జన ఘోష. అదిరిపోవడంలేదూ… విశాఖ బీచ్ రోడ్డులో ఈ నెల 15న అతి పెద్ద ర్యాలీకి రంగం సిద్ధం చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణ మీద విశాఖలో ఏర్పాటు అయిన నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తున్న ఫస్ట్ పోరాటం ఇది. దాని పేరే విశాఖ గర్జన.
విశాఖలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం దకా సుమారుగా మూడున్నర కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో విద్యార్ధులు యువత, అధ్యాపకులు న్యాయవాదులు, ప్రజా సంఘాలు, మేధావులు లక్షలాదిగా పెద్ద ఎత్తున పాల్గొంటారు అని నాన్ పొలిటికల్ జేఎసీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇది ఆరంభం మాత్రమే అని అధికార వికేంద్రీకరణం కోసం ఉత్తరాంధ్రా ఒక ఉద్యమంగా ఎగిసిపడుతుందని, విశాఖ గర్జన పవర్ ఏంటో ఏపీ మొత్తం చూస్తుందని వారు అంటున్నారు. ఇదిలా ఉండగా నాన్ పొలిటికల్ జేఏసీనాయకులు విపక్షాల మీద వాడి వేడిగా విమర్శలు సంధించారు.
ఉత్తరాంధ్రా ఓట్లతో నెగ్గి ఇక్కడ పదవులు పొంది అమరావతికి జై అంటే జనాలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. విశాఖలో సదస్సులు పెట్టి అంతా అమరావతికే అని చంద్రబాబు ఆనాడు సీఎం గా చేశారని నిందించారు. ఉత్తరాంధ్రా అంటే అమాయకం అనుకుంటే పొరబాటని, ఇక మీదట తమ తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా విశాఖ రాజధాని కోసం టీడీపీ వారు కూడా పాలుపంచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.